జ‌గ‌న్ బ్ల‌డ్‌లో భ‌యం లేదు: బాబాయి స‌ర్టిఫికెట్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సోమ‌వారం(ఫిబ్ర‌వ‌రి 23) నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశా లకు హాజ‌ర‌వుతున్న విష‌యం తెలిసిందే

Update: 2025-02-23 11:27 GMT

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సోమ‌వారం(ఫిబ్ర‌వ‌రి 23) నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశా లకు హాజ‌ర‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లే విష‌యంపై ప‌లు మీడియా ఛానెళ్ల‌లో కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు హెచ్చ‌రించిన కార‌ణంగానే జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్తున్నార‌ని.. లేక‌పోతే.. పులివెందుల‌కు ఉప‌ ఎన్నిక‌వ‌స్తుంద‌ని.. అందుకే ఆయ‌న స‌భ‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. సోష‌ల్ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి.

వీటిపై తాజాగా జ‌గ‌న్ బాబాయి, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``జ‌గ‌న్ ఎవ‌రికో భ‌య‌ప‌డి స‌భ‌కు వెళ్తార‌ని కొంద‌రు క‌థ‌లు అల్లుతున్నారు. అవి నిజం కాదు. జ‌గ‌న్ బ్ల‌డ్‌లో భ‌యం అనేదే లేదు. ఉంటే.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వారు కాదు`` అని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అయినా కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. ముఖ్యంగా మిర్చి రైతుల‌కు గిట్టుబాట ధ‌ర ప‌ల‌క‌డం లేద‌న్నారు.

దీనిపై జ‌గ‌న్ ఇప్ప‌టికే గుంటూరులో ప‌ర్య‌టించి రైతుల‌ను ఓదార్చార‌ని తెలిపారు. ఇక, సూప‌ర్ సిక్స్ హామీలు.. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయ్యాయ‌ని వైవీ చెప్పారు. వీట‌న్నింటిపైనా స‌భ‌లో ప్ర‌శ్నించేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యార‌ని.. అందుకే స‌భ‌కు వెళ్తున్నార‌ని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. అయితే.. ఎన్ని రోజులు స‌భ‌కు వెళ్తారు? కేవ‌లం తొలి రోజు మాత్ర‌మే వెళ్లి వ‌స్తారా? అనే దానిపై మాత్రం ``మీరే చూస్తారు క‌దా!`` వైవీ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు.

భ‌ద్ర‌త ఏదీ?

జ‌గ‌న్ కు జ‌డ్‌+ భ‌ద్ర‌త క‌ల్పించాల్సి ఉంద‌ని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించి.. జ‌గ‌న్‌కు ఇవ్వాల్సిన భ‌ద్ర‌త‌ను ఇవ్వ‌డం లేద‌న్నారు. ఇటీవ‌ల గుంటూరు లో ప‌ర్య‌టించిన‌ప్పుడు క‌నీసం ఒక్క కానిస్టేబుల్‌ను కూడా పంపించ‌లేద‌ని వైవీ తెలిపారు. దీనిపై కేంద్రానికి తాము ఫిర్యాదు చేసిన‌ట్టు వివ‌రించారు. కేంద్రం నుంచి స‌రైన స‌మాధానం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామ‌న్నారు. అసెంబ్లీలో ఈ విష‌యాన్ని కూడా జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తార‌ని తెలిపారు. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న కోస‌మే జ‌గ‌న్ స‌హా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు.

Tags:    

Similar News