టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి....టాప్ ప్రొడ్యూసర్లలలో ఒకరిగా ఎదిగిన బండ్ల గణేష్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. మెగా ఫ్యామిలీ...అందులోనూ ప్రత్యేకించి పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్ పరమ భక్తుడు. పవన్ - మెగా ఫ్యామిలీపై బండ్ల గణే్‌ష్ ఈగ కూడా వాలనివ్వడు. మెగా ఆడియో ఫంక్షన్ లలో పవన్ ను తెగ పొగిడేయడం బండ్లకు అలవాటు. గతంలో ఓ టీవీ డిబేట్ సందర్భంగా తాను తల్చుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ మెంట్ కూడా తీసుకోగలనని చాలెంజ్ చేశాడు. అయితే, గణేష చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయి నేతతో కాకపోయినా....జాతీయ స్థాయి నేతతో గణేష్ కు అపాయింట్ మెంట్ దక్కింది. ఆ చాలెంజ్ కు తగ్గట్లుగానే తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నిన్న రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. పవన్ పరమ భక్తుడు రాహుల్ తో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ - కమెడియన్....నుంచి మొదలుకొని బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ...పవన్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ - రవితేజలతో సినిమాలు తీశాడు. అయితే - టెంపర్ తర్వాత గణేష్ మరో సినిమా చేయలేదు. నంది అవార్డుల వివాదం సమయంలో మీడియా ముందుకు వచ్చిన గణేష్ ఆ తర్వాత తాజాగా ఈ ట్వీట్ తో వార్తల్లోకి వచ్చాడు. హఠాత్తుగా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ గణేష్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ``రాహుల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ....మీరే ఈ దేశపు భవిష్యత్తు సర్``అంటూ గణేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గణేష్ ...దేవుడిగా భావించే పవన్ కు వైరి వర్గం అయిన కాంగ్రెస్ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గణేష్ బరిలోకి దిగబోతున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి. రాహుల్ తో గణేష్ కు పని ఏంటి...ఏ సందర్భంలో కలిశారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే, పవన్ కు భక్తుడైన గణేష్ ....రాహుల్ కు క్యాజువల్ గా శుభాకాంక్షలు తెలిపాడని కొందరు అంటున్నారు. అయితే, ఆ ఫొటో ఎప్పుడు దిగింది అన్న విషయంపై క్లారిటీ లేదు.