బీజేపీ కౌంటర్: దేశ వ్యతిరేక, వారిస్ పఠాన్ వ్యాఖ్యలపై మౌనమేల కేసీఆర్

Update: 2020-02-23 00:30 GMT
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ఆర్పీకి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం పార్టీ ఉద్యమం తీవ్రం చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్నాటకలో కార్యక్రమాలు నిర్వహించింది. అయితే కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ వ్యతిరేక కార్యక్రమంలో ఓ యువతి పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసింది. అంతకుముందు కలబురిగిలో జరిగిన సమావేశంలో ‘15 కోట్ల మంది ముస్లింలు మాత్రమే ఉన్నారని.. కానీ వంద కోట్లు ఉన్న హిందువులకు తగిన సమాధానం చెప్పగలరు’ అని మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

అయితే ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం తో మిత్ర పక్షంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనమేలా వహిస్తున్నారని తెలంగాణ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారని కోరుతున్నారు. టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శలు చేశారు. వెంటనే దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని సవాల్ విసిరారు. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. భారతదేశ ముస్లింలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను, ఎంఐఎం పార్టీ వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. సీఏఏ వ్యతిరేక ఊరేగింపులకు భారదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్‌ జెండా అంటూ కృష్ణ సాగర్‌ విమర్శించారు.

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల పై టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరి తెలపాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, సెక్యులర్‌ అని చెప్పుకునే కాంగ్రెస్‌, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రధానంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ఆర్పీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శించారు.
Tags:    

Similar News