నేనంత గొప్పోడ్ని కాదు.. నేనే వెళతా.. బాబు నోట కొత్త మాట

Update: 2021-03-01 11:30 GMT
టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు సరికొత్తగా స్పందించారు. ఆయనకు అలవాటైన దర్పాన్ని వదిలేసిన ఆయన.. తనను తాను ‘నేనంత గొప్పోడ్ని కాదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. పవర్ పోయినా సరే.. మాజీ సీఎంను అంటూ గద్దించే గొంతు అందుకు భిన్నంగా ‘నాకెందుకు గౌరవం? నా దగ్గరకు ఎందుకండి? నేనంత గొప్పోడ్ని కాదు’అని అంటూ తనను బయటకు వెళ్లటానికి అనుమతించని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును స్థానిక పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. లాంజ్ నుంచి బయటకు పోనివ్వకుండా నిలిపివేశారు. బాబుతో పాటు ఆయన పీఏ.. వైద్య అధికారి ఇతరుల ఫోన్లను తీసేసుకున్న వైనం ఇప్పుడు వివాదంగా మారింది.

దీంతో.. తాను చిత్తూరు కలెక్టర్.. తిరుపతి.. చిత్తూరు ఎస్పీలకు లేఖ ఇచ్చి వెళతానని పోలీసుల్ని కోరారు. అందుకు స్పందించిన పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు సార్ అని చెప్పగా.. తాను కలుసుకునేందుకు హక్కు ఉందని.. ఆ ముగ్గురు అధికారుల్ని కలవాలన్నారు. ప్రెస్ తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాస్త ఆగ్రహాన్ని ప్రదర్శించిన చంద్రబాబు.. తాను ఎందుకు వచ్చానో చెప్పాలి కదా.. పద్నాలుగేళ్లుసీఎంగా పని చేశాను.. ప్రతిపక్ష నేతగా ఉన్నాను.. పర్మిషన్ లేదంటారా? అని ప్రశ్నించారు. అయినప్పటికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో నిలుచున్నచోటే ఆయన నిరసన వ్యక్తం చేశారు.

అక్కడికక్కడే నేల మీద కూర్చుండిపోయారు. దీంతో.. పోలీసులు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చేతులు జోడించి.. మీలాంటి వారు నేల మీద కూర్చోవటం బాగోదు.. వేరే చోట కూర్చోవచ్చు.. అక్కడకు వెళదామని అడగ్గా.. అక్కర్లేదన్నారు.కలెక్టర్.. ఎస్పీలను కలవటానికి తాను వెళతానంటే.. వారినే పిలిపిస్తామని పోలీసులు చెప్పగా.. తాను అంత గొప్పవాడిని కాదని.. తానే వెళతానని పేర్కొన్నారు. ఇలా..రేణిగుంట విమానాశ్రయం అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. ఏమైనా.. బాబు మాటలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. కోవిడ్ ఉన్నప్పటికీ మీటింగులు జరగటం.. వెంకటేశ్వర స్వామి వద్దకు 50వేల మంది వస్తున్నప్పుడు తననే ఎందుకు అడ్డుకోవాలని బాబు ప్రశ్నిస్తున్నారు.




Tags:    

Similar News