చంద్రబాబు...జగన్.. అర్ధిక విధానాల్లో టోటల్ ఫెయిల్... ?

Update: 2021-12-20 15:30 GMT
ఆర్ధికం  అంటేనే అతి ముఖ్యమైనది. డబ్బుంటేనే అన్నీ, దానితోనే అంతా.  ఈ జగమంతా ధనంతోనే సాగుతుంది. మరి దేశానికి రాష్ట్రానికి ఏలికలుగా ఉన్న వారు ఆర్ధిక విషయాల్లో సరిగ్గా లేకపోతే వారి ఫ్యూచరే కాదు, దేశాల, రాష్ట్రాల భవిష్యత్తు కూడా చిరిగి చేట అవుతాయి. ఇక  టీడీపీ అధినేత  చంద్రబాబునే తీసుకుంటే ఆయన తనను మించిన ఆర్ధిక వేత్త లేరు అని ఒకపుడు అనుకునే వారు. ఆయన తనకు తానుగా  సంస్కరణల రూపశిల్పిగా చెప్పుకునేవారు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ప్రపంచ ధోరణి కూడా వేరుగా ఉంది.  పూర్తిగా గ్లోబ్ మొత్తం మారుతోంది. ఓపెన్ మార్కెట్ పేరిట బార్లా తలుపులు నాడు తెరచేశారు.

దాంతో చంద్రబాబు కూడా చిన్న వయసులో  ముఖ్యమంత్రి కావడంతో ఆ వేడిలో జోరులో  తనలోని సంస్కరణల వాదిని ఒక్కసారిగా  బయటకు తీశారు. ఆయన అప్పట్లో చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి ఏపీలో సంస్కరణలను దూకుడుగా  అమలు చేశారు. ఫలితంగా ఉచితం అన్న మాటకే ఆయన మండిపడేవారు. అలాగే దేశానికి అన్నం పెట్టే రైతన్న విషయంలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.

ప్రపంచబ్యాంక్  విధానాలకు తలొగ్గిన చంద్రబాబు అన్ని ఆర్ధిక సంస్కరణలను తుచ తప్పకుండా పాటించేవారు. కరెంట్ ఉచితంగా ఇస్తే కరెంట్ తీగలకు బట్టలు ఆరేసుకోవడమే అంటూ బాబు నాడు అన్న మాటలు ఈ రోజుకీ ఆయన మీద ప్రత్యర్ధులు విమర్శలు చేయడానికి ఉపయోగిస్తారు.  ఒక్ దశలో వ్యవసాయం దండుగ అన్న పెద్ద మాట కూడా ఆయన వాడేసారు అని చెబుతారు. అదే విధంగా విద్యుత్ చార్జీలను కూడా పెద్ద ఎత్తున పెంచేశారు. వామపక్షాలవి కాలం చెల్లిన సిద్ధాంతాలు అని కూడా బాబు బాగా ఆడిపోసుకున్నారు.

ఉమ్మడి ఏపీలోని వేలాదిగా ఉన్న రైతుల నెత్తి మీద అధిక విద్యుత్ రేట్లతో బాదుడు బాదేశారు. మొత్తానికి సంక్షేమం అంటే పెద్దఎత్తున  మండిపోయిన బాబు దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా 2004 ఎన్నికల వేళ గట్టిగానే  చవిచూశారు. చంద్రబాబు ఒక విధంగా అప్పటి  ఎన్నికల్లో ఓడిపోవడానికి, వైఎస్సార్ గెలవడానికి ఆయన అనుసరించిన  ఆర్ధిక విధానాలు, సంస్కరణలు కారణం అని అంతా విశ్లెషిస్తారు.

ఇపుడు చూస్తే అదే చంద్రబాబు బాటలో జగన్ నడుస్తున్నారా అన్న చర్చ హాట్ హాట్ గా  సాగుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన్ని తీసుకువచ్చిన వర్గాలు చాలా బలహీనమైనవి. రైతులు, పేదలు ఇతరమైన నోరు లేని  వర్గాలు ఎన్నో  ఆయన మీద కోటి  ఆశలు పెట్టుకున్నాయి. అయితే అప్పట్లో చంద్రబాబు వ్యవహరించినట్లుగానే ఇపుడు జగన్ కూడా చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

జగన్ కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వానికి తలొగ్గి రైతులు వాడే ఉచిత విద్యుత్ బోర్లకు  మీటర్లను గట్టిగానే  బిగించారు. దాంతో అష్టకష్టాలు ఇప్పటికే పడుతున్న క‌ర్షకులు వైసీపీ సర్కార్ మీద గుర్రుగా ఉన్నారు.  మరో వైపు  జగన్ మార్క్ సంక్షేమం కూడా ఏపీని అప్పుల కుప్పగా మార్చేస్తోంది. ఆయన అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు జనాలలో అభాసు అవుతున్నాయి. జగన్ పాలన ఎలా ఉంది అంటే ఒక చేత్తో ఇచ్చి రెండవ చేత్తో లాక్కున్నట్లుగా అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరి రైతులు పెద్ద వర్గంగా ఉన్నారు. వారి విషయంలో ప్రభుత్వం కరెంట్ మీటర్లు పెట్టడం అంటే అది కచ్చితంగా వైసీపీకి గట్టి షాక్ ఇచ్చే నిర్ణయమే అంటున్నారు. అదే టైమ్ లో ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు అన్నది అందరి మాటగా ఉంది.

దాంతో ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రత్యేక నిధులు కూడా ఇవ్వడంలేదు. గతంలో నియోజకవర్గం నిధులు అంటూ ఎమ్మెల్యేలకు ఇస్తే దాంతో వారు ఎంతో కొంత అభివృద్ధి చూపించేవారు. ఇపుడు ప్రభుత్వం తానుగా ఏదీ అభివృద్ధి  చేయక ఎమ్మెల్యేలు  కూడా చేయలేకపోతున్నారు. మరి వైసీపీ ధీమా ఏంటి అంటే జగన్ కేవలం నవరత్నాలనే నమ్ముకున్నారుట.  అవి ఉంటే చాలు గెలుస్తామని అనుకోవడం.  దాంతో వైసీపీకి ఉన్న క్యాడర్ ని సైతం పక్కన పెట్టి పాతరేస్తున్నారు. ఏ పనికి అయినా ఇపుడు వాలంటీర్లే కనిపిస్తున్నారు. ఈ పరిణామాలతో గ్రామ స్థాయిలో  వైసీపీ క్యాడర్ పూర్తిగా డీమోరలైజ్ అయిపోయింది. మరి ఇలాగే కనుక కొనసాగితే  వచ్చే ఎన్నికల్లో జగన్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే వైసీపీ కొంప ముంచుతాయా అన్న సందేహాలు అయితే అందరిలో ఉన్నాయి. చూడాలి మరి.
Tags:    

Similar News