ఇప్పుడు బాబును ప్ర‌శించగ‌ల‌వా ప‌వ‌న్‌?

Update: 2017-05-06 16:32 GMT
క‌లియుగ దైవం శ్రీ వెంకటేశ్వ‌రుడు కొలువు దీరిన తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈఓగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే తిరుమల చేరుకున్న ఆయన వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆయన టీటీడీ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో టీటీడీ ఈఓగా సింఘాల్‌ ను నియమించిన విషయం తెలిసిందే.

చూస్తుంటే ఇది సాధార‌ణ వార్తే. దీనికి ప‌వ‌న్‌కు లింకేటి అనే సందేహం కూడా రావ‌చ్చు. కానీ ప‌వ‌న్ ప‌దే ప‌దే జ‌పించే ఉత్త‌రాది-ద‌క్షిణాది పెద్ద‌పీట వేయ‌డం ఇందులో ఇమిడి ఉంది కాబ‌ట్టే దీనికి ప‌వ‌న్ రియాక్ట్ అవాల్సి ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. మిత్ర‌ప‌క్షం అయిన‌ప్ప‌టికీ బీజేపీపై ఇటీవ‌ల ప‌వ‌న్ త‌న స్టాండ్ మార్చుకొని ప‌లు అంశాల‌పై మండిప‌డుతున్నారు. ముఖ్యంగా ద‌క్షిణాదీయుల‌పై ఉత్త‌రాది వివ‌క్ష స‌రికాదు, ఉత్త‌రాది ప్రాంతానికి చెందిన వారు మ‌మ్మ‌ల్ని అణిచివేయ‌వ‌ద్దని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ విధానాన్ని త‌ప్పుప‌ట్టిన ప‌వ‌న్‌...ఇప్పుడు అదే ఉత్త‌రాదికి ప్రాధాన్యం ఇచ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు తీరుపై ఏ విధంగా స్పందిస్తార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన టీటీడీ ఈఓ నియామ‌కంపై ప‌వ‌న్ స్పందించాలి అంటే....ఇప్పటివరకూ ఏనాడూ ఉత్తరాది అధికారికి టీటీడీ పగ్గాలు ఇచ్చిన దాఖలాలు లేవనీ, ఒకసారి ఉత్తరాదికి చెందిన అధికారికి టీటీడీ ఈఓ పదవి అప్పగిస్తే, ఇకపై అదే సంప్రదాయం కొనసాగుతుందని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌లకు అవకాశాలు ఏమాత్రం ఉండవని చెబుతున్నారు. ఇప్పటికేప‌లు కార‌ణాల వ‌ల్ల ఉత్తరాది హవా పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిష్ఠాత్మక టీటీడీ ఈఓ పదవి కూడా వారి ఖాతాలోకి వెళితే, ఇక దక్షిణాది ఉనికి పూర్తిగా కనుమరుగయిపోతుందన్న ఆవేదన తెలుగు అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు స్పందించపోతే, ప్రతిష్ఠాత్మకమైన టీటీడీపై రాష్ట్రం పట్టు కూడా పోతుందని స్పష్టం చేస్తున్నారు.ఇలా కీల‌క కార‌ణాలు ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్ స్పంద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News