సీట్లో స్వాములోరు కూర్చున్నాకే కేసీఆర్

Update: 2016-11-24 04:22 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాస గృహప్రవేశ కార్యక్రమం ఈ రోజు ఉదయం 5.22 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఒక సంఘటన ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసినట్లుగా చెప్పాలి. గృహప్రవేశ కార్యక్రమం మొత్తం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.. ఆయన విపరీతంగా నమ్మే చిన జీయర్ స్వామి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఇంట్లోని ప్రతి గదిని చినజీయర్ స్వామికి స్వయంగా చూపించటం.. ఆయన ఆశీర్వచనం పలకటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇంట్లోని సీఎం కార్యాలయంలోకి వెళ్లిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లోపలికి వెళ్లిన తర్వాత.. అక్కడున్న కుర్చీలో జీయర్ స్వామిని కూర్చోవాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. దీంతో.. ఆయన వెళ్లి ఆ కుర్చీలో కూర్చున్నారు. కొద్ది క్షణాలు మాత్రమే ఆ కుర్చీలో కూర్చున్న జీయర్ స్వామి తర్వాత లేవగా.. కేసీఆర్ ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. ఈ సందర్భంలో కేసీఆర్ ను కుర్చీలో కూర్చోవాల్సిందిగా చినజీయర్ స్వామి సూచన చేశారు.

ఎంత అభిమానం ఉంటే మాత్రం.. తెలంగాణ సీఎం అధికారిక నివాసంలోని ఆయన కార్యాలయ కుర్చీలో మొదల చినజీయర్ స్వామిని కూర్చోబెట్టటం ద్వారా.. తనకు ఆయనెంత ముఖ్యమన్న విషయాన్ని కేసీఆర్ తన చర్య ద్వారా చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పొచ్చు. ఈ మొత్తం ఉదంతంలో కొందరి అభ్యంతరం ఏమిటంటే.. ఆ నివాసం కేసీఆర్ సొంతం కాదు. ఆయన సీఎంగా ఉన్నంత వరకూ మాత్రమే. ఇంకో మాటగా చెప్పాలంటే.. ఆ నివాసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన అధికారిక నివాసం. మరి.. ప్రభుత్వానికి చెందిన నివాసంలోని.. కుర్చీలో వ్యక్తిగత అభిమానాల్ని ఎలా ప్రదర్శిస్తారన్నది ప్రశ్న. ఇప్పటి రోజుల్లో ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉందా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News