కుప్పం సర్వే నిజమేనా ?

Update: 2021-11-11 06:30 GMT
ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే సర్వే సంస్ధలు అక్కడ వాలిపోతాయి. అభ్యర్ధులు ఖరారైన వెంటనే, ఎన్నికలకు ముందు, పోలింగ్ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్ అని ఇదని సంస్ధలు సర్వేలు నిర్వహించటం ఫలితాలను విడుదల చేయటం మనకు కొత్తేమీ కాదు. మొన్న హుజూరాబాద్ అసెబ్లీ ఉపఎన్నికల విషయంలో కూడా నాలుగు పెద్ద సంస్ధలే ఇలాంటి సర్వే చేసి ఫలితాలను విడుదల చేశాయి. చివరకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో ఫలితాలను లీకుల రూపంలో బయటకు వదిలాయి. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో చెప్పినట్లే ఈటల రాజేందర్ మంచి విజయంతో గెలిచారు.

మొదటిసారిగా సర్వే సంస్ధలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు నిజమయ్యాయి. మామూలుగా సర్వేలన్నీ నిజమవ్వాలని రూల్ ఏమీలేదు. కాకపోతే ఓటర్ల నాడి ఎలాగుందో అంచనా వేసుకునేందుకు ఒక సాధనంగా మాత్రమే ఇలాంటి సర్వేలు ఉపయోగపడతాయంతే. ఇప్పుడిదంతా ఎందుకంటే కుప్పం మునిసిపాలిటి ఎన్నికలు జరగబోతున్నాయి. కుప్పం నుండి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇక్కడ టీడీపీ గెలవటాన్ని మాజీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇదే సమయంలో కుప్పంలో వైసీపీని ఎలాగైనా గెలిపించాల్సిందే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలెంజిగా తీసుకున్నారు. దాంతో కుప్పం మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే పీపుల్స్ పల్స్ ఏజెన్సీ అనే సంస్ధ జనాల అభిప్రాయాలను సేకరించిందట. 25 వార్డుల్లో 8 వేల మంది అభిప్రాయాల ప్రకారం మునిసిపాలిటి వైసీపీ ఖాతాలోనే పడబోతోంది. మొత్తం వార్డుల్లో వైసీపీ 14 చోట్ల గెలవబోతోందట. టీడీపీ 4 వార్డుల్లో గెలుస్తుందట. మిగిలిన 7 వార్డుల్లో పోటీ చాలా టైట్ గా ఉందట.

జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై 62.37 శాతం మంది సంతృప్తిగా ఉన్నారట. అలాగే 22.36 శాతం మంది అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. సంతృప్తి గానీ లేదా అసంతృప్తిని గాని వ్యక్తం చేయటానికి ఇష్టపడని వారు 15.27 శాతం ఉన్నారట. అంటే ఎటు చెప్పలేని వారి శాతం బాగా ఎక్కువగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. వైసీపీకి ఓట్లేస్తామని చెప్పిన వారు 58.26 శాతం ఉన్నారట. టీడీపీకి మద్దతిస్తున్నట్లు 40. 07 శాతం ఉన్నట్లు తేలింది. రెండు పార్టీలు కాకుండా ఇతరులకు ఓట్లేస్తామని చెప్పిన వారు 1.67 శాతం ఉన్నారట.

ప్రస్తుతం కుప్పంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రెండు పార్టీలు కూడా గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్ధమైపోతోంది. ఇంత టైట్ ఫైట్ లో కూడా టీడీపీ 4 వార్డుల్లో గెలుస్తుందని సర్వేలో వెల్లడవ్వటమంటే మామూలు విషయం కాదు. ఇదే సమయంలో 7 వార్డుల్లో టైట్ ఫైట్ జరుగుతోందని సర్వేలో తేలటం కూడా చిన్న విషయం కాదు. నాలుగు వార్డుల్లో టీడీపీ గెలుస్తుందని, 7 వార్డుల్లో టైట్ ఫైట్ జరుగుతోందని సర్వేలో తేలిందంటే ఇది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టే.


Tags:    

Similar News