జేఎన్‌ యూ పూర్వ విద్యార్థిపై దేశ‌ద్రోహం కేసు..?

Update: 2020-04-18 09:30 GMT
ప్ర‌స్తుతం అయితే క‌రోనా వైర‌స్ వార్త‌లే ప్ర‌పంచ‌మంత‌టా ఉన్నాయి. కానీ అంత‌కుముందు అంటే న‌వంబ‌ర్‌ - డిసెంబ‌ర్‌ - జ‌న‌వ‌రి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ) - ఎన్నార్సీ - ఎన్‌ పీఆర్‌ పైనే చ‌ర్చ సాగుతోంది. వాటి వ‌ల‌న దేశ‌వ్యాప్తంగా ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా విశ్వ‌విద్యాల‌యంలో ప‌రిణామాలు తీవ్రంగా మారిన దృశ్యాలు మ‌నం చూసే ఉన్నాం. మ‌ళ్లీ ఆ అంశంపై తాజాగా ఓ ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ విశ్వ‌విద్యాల‌యం అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్‌ యూ పూర్వ విద్యార్థి షార్జీల్‌ ఇమామ్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో మ‌రోసారి ఆ అంశం చ‌ర్చ‌కు దారి తీసింది.

విశ్వ‌విద్యాల‌యంలో డిసెంబర్ 15వ తేదీన తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను షార్జిల్ ఇమామ్ రెచ్చగొట్టాడ‌ని ఆరోపిస్తూ అత‌డిపై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ వేశారు. గతేడాది డిసెంబర్‌ లో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జామియా మిలియా విశ్వవిద్యాల‌య విద్యార్థులు నిర‌స‌న‌లు తెల‌ప‌డంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ విశ్వ‌విద్యాల‌యం సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ - జామియా నగర్‌ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన అల్లరి మూకలు అనంతరం యూనివర్సిటీలో ప్రవేశించారని పోలీసులు చెబుతున్నారు. రాళ్లు రువ్వుతూ.. ఆయుధాలు చేపట్టి కొంత మంది అల్లర్లకు తెరతీశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ - ప్రైవేటు ఆస్తులను భారీగా ధ్వంసం చేయ‌డంతోపాటు ఎంతో మంది పోలీసులు - సామాన్య పౌరులకు గాయాలైన సంద‌ర్భంగా అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పోలీస్ వ‌ర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే గ‌తేడాది డిసెంబర్ 13వ తేదీన షార్జీల్‌ ను అరెస్టు చేశారు. దర్యాప్తు లో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 124 ఏ ఐపీసీ - 153 ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు ఢిల్లీ పోలీసులు వెల్ల‌డించారు. ఈ మేరకు అత‌డి పై సాకేత్‌ జిల్లా కోర్టు లో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

జేఎన్‌ యూలోనే కాదు షార్జీల్ సీఏఏకు వ్యతిరేకంగా షాహిన్‌ బాగ్‌ లో జ‌రిగిన ఆందోళ‌నల్లో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలోనూ అస్సాం - ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అత‌డిపై మణిపూర్‌ - అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. అయితే ప్ర‌స్తుత స‌మ‌యంలో అత‌డిపై కేసు న‌మోదు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఏఏ పై ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగిన సంద‌ర్భంలో మ‌రోసారి ఈ అంశం పై తెర‌పైకి తీసుకు రావ‌డం భావ్యం కాద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News