ట్రంప్ తాజా నిర్ణ‌యం..7500 భార‌తీయులు ఇంటికి!

Update: 2017-09-04 16:56 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భార‌తీయుల‌కు మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ ఇవ్వ‌నున్నారా? ఇప్ప‌టికే గ్రీన్ కార్డ్‌ - హెచ్‌1బీ వీసాలతో భార‌తీయుల‌ను అవ‌కాశాల గ‌ని అమెరికాకు దూరం చేసే నిర్ణ‌యాల‌ను తీసుకున్న అగ్ర‌రాజ్య‌ధిప‌తి మ‌రోమారు అదే త‌ర‌హా నిర్ణ‌యం వెలువ‌రించ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. పసితనంలో అక్రమంగా అమెరికాలోకి చొరబడిన చిన్నారులకు రక్షణ కల్పించిన తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్‌ ఒబమా విధానానికి ట్రంప్‌ చరమగీతం పాడనున్నట్లు తెలుస్తోంది. ప‌సితనంలో అమెరికాకు వలసవెళ్ళిన యువత భవిష్యత్‌ పై  మంగళవారం నోరు విప్పనున్నారు. ఈ మేరకు శ్వేతసౌధ మీడియా ఉన్నతాధికారి సారా సాండర్స్ తెలిపారు.

చిన్న‌త‌నంలో వ‌ల‌స వ‌చ్చి అక్రమదారుల్లో సుమారు ఎనిమిది లక్షల మంది చిన్నారులు అమెరికాలో నివాసముంటున్నట్లు అధికార గ‌ణాంకాలు ఉన్నాయి. ఇందులో భార‌తీయుల సంఖ్య సుమారు 7500. వీరందరికీ ఒబమా ప్రభుత్వం ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌ హుడ్‌ అరైవల్స్‌ ప్రొగ్రామ్‌’ కింద రక్షణ కల్పించింది. అయితే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం సమయంలో ట్రంప్‌ ఈ ప్రొగ్రామ్‌ ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటువంటి విధానాల వల్ల అమెరికా ఆర్థిక - రాజకీయ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత ఈ విధానాన్ని కుహనా డ్రీమర్స్‌ ప్రొగ్రామ్‌గా ట్రంప్‌ అభివర్ణించారు.ఈ నేప‌థ్యంలో దీనిపై ట్రంప్‌ కీలక నిర్ణయం వెల్లడిస్తారని వైట్ హౌస్‌ వ‌ర్గాలు అంటున్నాయి. ట్రంప్‌ ఎటుంటి నిర్ణయం వెలువరిస్తారో అన్న విషయంపై డ్రీమర్స్‌లో కూడా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భార‌తదేశానికి చెందిన సుమారు 7500 మందిలో భ‌విష్య‌త్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇప్ప‌టికే అనేక మంది భార‌తీయుల‌ను ఇంటికి పంపిన ట్రంప్ తాజా చ‌ర్య‌తో అదే త‌ర‌హా నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా... అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఒబమా విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మ‌రోవైపు దీనిపై ఇప్పటికే పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సీఈఓలు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్స్‌ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ళ ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మొత్తంగా ట్రంప్ ఏం చేయ‌నున్నారో అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.
Tags:    

Similar News