బీజేపీలోకి వంశీ... టీడీపీకి షాకేనా ?
వంశీ మీద కేసులు ఉంటాయని ఆయనను ఇబ్బందుల పాలు చేస్తారని వార్తలు వినవస్తున్న నేపధ్యంలో కూటమిలో కీలకమైన బీజేపీలో చేరడం ద్వారా ఆయన అధికార కూటమి నేత అవుతారు అని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఒక సారి ఎంపీ టికెట్ ని రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ని అందుకుని రెండు సార్లు వరసగా విజయవాడ గన్నవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారు వల్లభనేని వంశీ. అంగబలం అర్ధబలం ఉన్న వంశీని టీడీపీ బాగానే ప్రోత్సహించింది. ఆయన కూడా పార్టీ ఇచ్చిన అవకాశాలను వాడుకుంటూ దూకుడుగానే రాజకీయం చేశారు.
అయితే 2019లో టీడీపీ ఓటమి తరువాత ఆయన అడుగులు వైసీపీ వైపు పడ్డాయి. అలా ఆయన జగన్ సమక్షంలో ఫ్యాన్ నీడకు చేరారు. అప్పటి నుంచి ఆయన టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక దశలో చంద్రబాబు లోకేష్ ల మీద వ్యక్తిగత విమర్శలూ ఎక్కుపెట్టారు. అవి కాస్తా అతి పెద్ద వివాదానికి కూడా దారి తీశాయి. ఆ పరిణామాల నేపధ్యం కూడా వంశీకి కంచుకోట లాంటి గన్నవరంలో 2024 ఎన్నికల్లో ఆయన ఓటమికి దారి తీసిందని అంటారు.
ఇక గడచిన ఆరు మాసాలుగా వంశీ అయితే పెద్దగా చడీ చప్పుడూ చేయడం లేదు. ఆయన మీద టీడీపీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని కేసులు పెడుతుందని కూడా ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఆయన ఉండేది హైదరాబాద్ లోనా లేక అమెరికాలోనా అన్నది అయితే తెలియడం లేదు. మొత్తానికి ఆయన వైసీపీకి బహు దూరంగా ఉంటూ వస్తున్నారు అన్నది అయితే తేలిపోయింది అంటున్నారు.
ఈ క్రమంలో ఆయనకు ఎటూ టీడీపీ జనసేనలలో ప్రవేశానికి అవకాశం లేనందువల్ల కూటమిలో మూడవ పార్టీ అయిన బీజేపీలో చేరాలని చూస్తున్నారు అని వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి.
వంశీ మీద కేసులు ఉంటాయని ఆయనను ఇబ్బందుల పాలు చేస్తారని వార్తలు వినవస్తున్న నేపధ్యంలో కూటమిలో కీలకమైన బీజేపీలో చేరడం ద్వారా ఆయన అధికార కూటమి నేత అవుతారు అని అంటున్నారు.
ఆయన గతంలో చంద్రబాబు ఫ్యామిలీ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల టీడీపీ క్యాడర్ అంతా పూర్తి ఆగ్రహంతో ఉన్నారని అదే విధంగా ఆయన పదేళ్ల ఎమ్మెల్యే పాలనలో అక్రమాలు చేశారా అంటూ ఆరా తీసే పనులలో ఉన్నారని ఆ విధంగా ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు. దాంతో వైసీపీలో ఉంటే కచ్చితంగా తనకు ఇబ్బందులు తప్పవని భావించిన వంశీ బీజేపీ వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
బీజేపీలో చేరితే కనుక జాతీయ పార్టీ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారని అందుకే ఈ మాస్టర్ పొలిటికల్ స్కెచ్ గీసారని అంటున్నారు. ఇదిలా ఉండగా వంశీ సాధ్యమైనంత తొందరలో కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని కలుస్తారని జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు.
ఈ వార్తలు అయితే ప్రస్తుతం విజయవాడలో గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉంటే వంశీని వైసీపీలోకి తెచ్చి ఆ పార్టీ బావుకున్నది ఏమీ లేదని అంటున్నారు. పైగా ఆయన అనుచితా వ్యాఖ్యల పరిణామాల వల్ల వైసీపీ భారీ మూల్యం గత ఎన్నికల్లో చెల్లించాల్సి వచ్చిందని కూడా అంటున్నారు
ఆయన అపుడు కూడా షెల్టర్ కోసమే వైసీపీని ఆశ్రయించి ఆ పార్టీలో చేరారు అని విమర్శలు చేస్తున్న వారూ ఉన్నారు. పార్టీకి ఎంతో విధేయులుగా ఉన్న యార్లగడ్డ వెంకటరావుకు టికెట్ ని నిరాకరించి మరీ వంశీకి ఇవ్వడం ద్వారా వైసీపీ తన ఓటమిని తానే కొని తెచ్చుకుందని అంటున్నారు. ఇపుడు వైసీపీ ఓటమితో వంశీ తన రాజకీయాన్ని తాను చూసుకుంటున్నారని కూడా అంటున్నారు.
ఏది ఏమైనా వంశీని బీజేపీ తీసుకోవడం ద్వారా టీడీపీకి ఏ విధంగా సమాధానం చెబుతుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. టీడీపీ జనసేన వద్దు అనుకున్న పార్టీలను బీజేపీ చేరదీయడం ద్వారా తన బలం పెంచుకోవడం పక్కన పెడితే కూటమిలో ఇబ్బందులకు దారితీస్తుందా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. వల్లభనేని వంశీని బీజేపీ చేర్చుకోవడం ద్వారా ఏమి సాధిస్తుందో కానీ వంశీకి మాత్రం అధికారికంగా ఒక రక్షణ లభిస్తుందని అంటున్నారు. చూడాలి మరి బీజేపీలో వంశీగానం ఏ విధంగా ఉంటుందో.