హతవిధీ.. అమెరికాలో ఫెడరల్ ఉద్యోగులకు ఊహించని అనుభవాలు!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. ఇన్ని రోజులూ అక్రమ వలసదారులను, వలసదారులను, విదేశీ విద్యార్థులను టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే;
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. ఇన్ని రోజులూ అక్రమ వలసదారులను, వలసదారులను, విదేశీ విద్యార్థులను టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఫెడరల్ ఉద్యోగులకు కొత్త టాస్క్ లు ఇచ్చారు. దీంతో... చాలా ఏళ్ల తర్వాత ఆఫీసుబాట పట్టిన ఉద్యోగులకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయంట.
అవును... రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్.. అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... కోవిడ్-19 మహమ్మారి కారణంగా అనేక మంది ఫెడరల్ ఉద్యోగులకు నాడు బైడెన్ ప్రభుత్వం ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించింది. అయితే.. ట్రంప్ ఆదేశాల మేరకు వీరంతా ఆఫీసుల బాట పట్టారు.
ఇలా కొన్నేళ్లుగా ఇళ్లకే పరిమితమైన వీరంతా ఇప్పుడు ఆఫీసుల బాట పట్టారు. దీంతో... తమ తమ కార్యాలయాలకు చేరుకొంటున్నారు ఉద్యోగులు. అయితే వీరికి ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాని అంటున్నారు. ఇందులో భాగంగా... తాజాగా వాషింగ్టన్ లో ఉన్న నాసా హెడ్ ఆఫీసులో ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైందంట.
ఆఫీసులో డెస్కులు లేకపోవడంతోపాటు ఎక్కడికక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయని అనేక మంది ఉద్యోగులు వాపోతున్నారని అంటున్నారు. ఈ మేరకు ఆఫీసులో ఎక్కడికక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయని.. మరికొంతమందికి డెస్కులు లేవని, అయినప్పటికీ అలాగే పని చేసుకుంటున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
దీనిపై స్పందించిన నాసా ఉద్యోగ సంఘం... గత నెల ఆఫీసుకు వచ్చినప్పుడు.. తమ హెడ్ ఆఫీసులో పూర్తిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫ్లోర్ మీద బొద్దింకలు, కుళాయిల్లో పురుగులు కనిపించాయని వెల్లడించింది. ఇదే సమయంలో.. కనీసం డెస్కులు లేకుంటే విధులు ఎలా నిర్వర్తిస్తామని ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది.
ఇక మరికొన్ని కార్యాలయాల్లో అయితే అసలు ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేదని.. డెస్కులు లేకపోవడంతో కొంతమంది నేలపైనే కూర్చోంటున్నారని.. పర్సనల్ మొబైల్ డేటా సాయంతో విధులు నిర్వర్తిస్తున్నారని మరో ఫెడరల్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. దీంతో... పొమ్మనలేక పొగబెట్టడంలో భాగంగానే ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందా అనే సందేహాలు పలువురు వ్యక్తపరుస్తున్నారని అంటున్నారు.