సోము టోన్ మారుతోంది... బాబుకే షాకింగ్ గా !
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారు సోము వీర్రాజు. నిజానికి ఆయన పార్టీకి దశాబ్దాలుగా సేవ చేస్తూ వచ్చారు.;

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారు సోము వీర్రాజు. నిజానికి ఆయన పార్టీకి దశాబ్దాలుగా సేవ చేస్తూ వచ్చారు. కానీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కాలేకపోయారు. ఆ విషయం అలా ఉంచితే ఆయనకు లక్ వేరే రూపంలో వచ్చి ఎమ్మెల్సీ పదవి మాత్రం ఒకటికి రెండు సార్లు దక్కింది.
ఆయన 2015లో తొలిసారి ఎమ్మెల్సీ అయ్యారు. అపుడు టీడీపీ పొత్తులోనే ఇది సాధ్యమైంది. 2021లో రిటైర్ అయిన సోముకి మళ్ళీ 2025లో ఆ లక్ వరించింది. ఈసారి కూడా టీడీపీ పొత్తుతోనే. మొత్తానికి సోముకు శాసనమండలి బాగా చోటిస్తోంది. ఈసారి ఆయనకు ఇంకా అవకాశం ఉంటే మంత్రి కూడా కావచ్చేమో.
అయితే ఆయన మీద తమ్ముళ్లకు కొంత వ్యతిరేకత ఉంది అని ప్రచారంలో ఉంది. ఎందుకు అంటే ఆయన జగన్ కి అనుకూలం అని వారు అనుమానిస్తారు. ఆయన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు చంద్రబాబుని గట్టిగా టార్గెట్ చేసేవారు. ఘాటుగా విమర్శలు చేసేవారు. దాంతో పాటు టీడీపీతో పొత్తు ఉండదని కూడా అంటూండేవారు.
మొత్తానికి టీడీపీ పొత్తుతోనే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది అంటే ఆయన కూడా మాటలను సంభాళించుకుని ఉండాల్సిందే అని అర్థం అంటున్నారు. మరి ఏ హామీ పార్టీ పెద్దలకు ఇచ్చారో లేక తానుగా మారాలని అనుకున్నారో తెలియదు కానీ సోము వీర్రాజు టోన్ లో మాత్రం పూర్తిగా మార్పు వస్తోంది.
ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యాక ఆయన మీడియా ముందుకు వచ్చి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయన జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. ఆయనకు ప్రతిపక్ష హోదా రాదు అని తెలిసి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలను జగన్ ప్రస్తావించకుండా ప్రతిపక్ష హోదా అంటూ పొలిటికల్ స్టంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజానికి సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఎపుడూ ఈ స్థాయిలో జగన్ మీద విమర్శలు చేసి ఉండలేదు. ఇపుడు మాత్రం ఆయన తానుగా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ తాను వైసీపీకి అనుకూలం కాదని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఎమ్మెల్సీగా నెగ్గాక ఆయనకు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. అపుడు కూడా తనకు జగన్ సీఎం అయ్యాకే తెలుసు అని ఆయనతో తనకు ఎలాంటి రాజకీయ బంధం లేదని తేల్చేశారు. ఇపుడు చూస్తే జగన్ ని గట్టిగా విమర్శిస్తున్నారు. ఆరేళ్ళ తన ఎమ్మెల్సీ పదవి కాలంలో ఆయన జగన్ నే గురి పెట్టి సంచలన విమర్శలు కానీ కామెంట్స్ కానీ ఇక మీదట చేయబోతారు అని అంటున్నారు.
దానికి ఆరంభంగా ఈ విమర్శలు అంటున్నారు. మొత్తానికి బాబుకే షాకింగ్ గా సోము వ్యాఖ్యలు ఉంటున్నాయని అంటున్నారు. సోము వీర్రాజుకు ఇక అధికార పదవులు దక్కవని అనుకుంటున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు అంటే చాలా మారబట్టే కదా అన్న కామెంట్స్ వస్తున్నాయి మరి.