నటి రన్యారావు కేసులో కీలక పరిణామాలు.. భర్త, సవతి తండ్రి కీలక వ్యాఖ్యలు
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో తాజాగా ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు కీలక సమాచారం అందించారు.;
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో తాజాగా ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు కీలక సమాచారం అందించారు. రన్యతో తనకు గత ఏడాది నవంబర్‌లో వివాహం జరిగిందని, అయితే డిసెంబర్ నెల నుంచే తామిద్దరం వేర్వేరుగా ఉంటున్నామని ఆయన కోర్టుకు తెలిపారు. తాము ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా జీవిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ స్మగ్లింగ్ కేసులో తనను అరెస్టు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జతిన్ దాఖలు చేసిన పిటిషన్‌లో భాగంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తదుపరి విచారణ జరిగే వరకు హుక్కేరిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని గత వారంలో కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు మార్చి 24వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. ఆ తర్వాత జతిన్ చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ తాము పిటిషన్ దాఖలు చేస్తామని డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్పష్టం చేశారు.
-సంబంధం లేదన్న రన్యారావు సవతి తండ్రి
కాగా రన్యా రావుకు సవతి తండ్రి అయిన కర్ణాటక డీజీపీ ర్యాంకు అధికారి కె.రామచంద్రరావు గతంలో మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆమెకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగిందని, అప్పటి నుంచి తమ ఇంటికి ఆమె రాలేదన్నారు. ఆమె తన భర్తతో కలిసి ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారో తమకు తెలియదని ఆయన వెల్లడించారు. ఈ తాజా పరిణామంతో తాను షాక్‌కు గురయ్యానని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే జతిన్ పేరు వెలుగులోకి వచ్చింది.
నాలుగు నెలల క్రితం బెంగళూరులోని పంచతార హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్‌లో రన్యా, జతిన్‌ల వివాహం జరిగింది. వివాహం తర్వాత వీరు లావెల్లీ రోడ్డులోని ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. జతిన్ ఆర్వీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఆర్కిటెక్చర్ , ఇంటీరియర్ డిజైనింగ్‌లో పట్టా పొందారు. ఇంటీరియర్ డిజైనర్‌గా , బెంగళూరులో ఒక రెస్టారెంట్ యజమానిగా ఉన్న జతిన్ తన వ్యాపారాన్ని ముంబై, ఢిల్లీ నగరాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో వీరిద్దరూ కలిసి అనేకసార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు తేలింది.
-రన్యారావు సవతి తండ్రిని సెలవుపై పంపిన ప్రభుత్వం
నటి రన్యా రావు బంగారు అక్రమ రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నేపథ్యంలో రన్యా రావు సవతి తండ్రి, కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి కె. రామచంద్రరావును ప్రభుత్వం తప్పనిసరి సెలవుపై పంపింది. కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న రామచంద్రరావును సెలవుపై పంపడానికి గల కారణాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఆయన డీజీపీ హోదాలో ఉండటంతో కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావును 14.8 కిలోల బంగారంతో అధికారులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై రామచంద్రరావు స్పందిస్తూ ఈ విషయం మీడియా ద్వారా తెలిసిందని, తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తనకు ఈ వ్యవహారం గురించి ఇతర వివరాలు తెలియవని, మాట్లాడేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రన్యా రావు తన భర్తతో విడిగా ఉంటున్నారని, వారికి కుటుంబ సమస్యలు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.విచారణలో రన్యా రావు గతంలో తనకున్న పరిచయాలతో భద్రతా తనిఖీలను తప్పించుకున్నట్లు వెల్లడైంది. ఆమె కర్ణాటక డీజీపీ కుమార్తెనని చెప్పి పోలీసు ఎస్కార్ట్‌ను కూడా కోరినట్లు సమాచారం.
-రన్యారావు చిక్కిందిలా..
గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్ వెళ్లిన ఆమె కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. మార్చి 3న దుబాయ్ నుంచి వచ్చిన రన్యా రావు వద్ద కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఆమె తన దుస్తుల్లో దాచి, కొంత బంగారాన్ని ధరించి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. అధికారులు ఆమె భర్తతో కలిసి ఉంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించి రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారు అక్రమ రవాణా కేసును డీఆర్‌ఐ, సీబీఐ, ఈడీ విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. రన్యా రావు కేసును డీఆర్‌ఐ విచారిస్తుండగా ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను, దాని నిర్వాహకులను సీబీఐ పరిశీలిస్తోంది. హవాలా మార్గాల ద్వారా జరిగిన లావాదేవీలను ఈడీ విచారిస్తోంది.