పెద్దాయనతో కేటీఆర్.. ఫొటో అదిరిపోలా..

ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దలు జానారెడ్డితో కేటీఆర్ సన్నిహితంగా కనిపించి మీడియా ముఖంగా ఫొటోలు దిగడం చర్చనీయాంశమైంది.;

Update: 2025-03-18 06:27 GMT

ఊరికే కలవరు మహానుభావులు అని.. రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ ను బద్ధంగా వ్యతిరేకించే కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏకంగా కేటీఆర్, హరీష్ రావులను కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దలు జానారెడ్డితో కేటీఆర్ సన్నిహితంగా కనిపించి మీడియా ముఖంగా ఫొటోలు దిగడం చర్చనీయాంశమైంది. చూస్తుంటే కాంగ్రెస్ పెద్దలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న వేళ సోమవారం రెండు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ పరిణామాలను చూద్దాం.

మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావులతో కలిసి కొంతసేపు చర్చలు జరిపారు. ఈ భేటీ ఎందుకు జరిగిందనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సంఘటన మరువకముందే అసెంబ్లీ ఆవరణలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఇద్దరు సీనియర్ నేతల ఆత్మీయ కలయిక తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేటీఆర్ బయటకు వెళ్తుండగా, జానా రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద కారు దిగుతున్న జానా రెడ్డిని చూసిన కేటీఆర్ వెంటనే స్పందించి "హాయ్ అంకుల్" అంటూ పలకరించారు. జానా రెడ్డి కూడా కేటీఆర్‌కు ప్రతి నమస్కారం చేశారు. అనంతరం కేటీఆర్, జానా రెడ్డి వద్దకు వెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, "మీకెక్కడ వయసు అయిపోయింది... మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నా" అని సరదాగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యతో జానా రెడ్డితో పాటు అక్కడున్న వారంతా నవ్వారు. ఈ రెండు సంఘటనలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News