సునంద పుష్కర్ కేసు: శశిథరూర్ కు ఊరట

Update: 2021-08-18 08:30 GMT
తన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది.

దాదాపు ఏడేళ్ల క్రితం.. 2014, జనవరి 17 ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. నాడు యూపీఏ ప్రభుత్వంలో శశిథరూర్ కేంద్రమంత్రిగా ఉన్నారు.

తొలుత హత్య అన్న కోణంలో విస్తృతంగా విచారణ జరిపారు. చివరకు ఆమెది ఆత్మహత్య అని పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.

అయితే సునంద ఆత్మహత్య చేసుకునేలా శశిథరూర్ ప్రవర్తించారని ఆయనపై అభియోగాలునమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శశిథరూర్ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ పై ఆయన ఉన్నారు. దీనిపై ఢిల్లీ కోర్టును శశిథరూర్ ఆశ్రయించారు.

ఈ కేసుపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు.. నేడు థరూర్ పైన నమోదైన అభియోగాలను కొట్టివేసింది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన అదనపు పత్రాలను సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులకు అనుమతిచ్చింది.

తనను నిర్ధోషిగా విడదుల చేసినందుకు కోర్టుకు శశిథరూర్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని.. ఇప్పుడు నాకు వాటి నుంచి ఉపశమనం లభించిందని శశిథరూర్ పేర్కొన్నారు.




Tags:    

Similar News