భీమిలి నుంచి లోకేశ్!... ఛాన్సే లేదంటున్నాడే!

Update: 2019-03-03 17:07 GMT
త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ ద‌ఫా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌డం లేదు. ప‌రోక్ష ఎన్నిక ద్వారా ఎమ్మెల్సీగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేశ్... ఏకంగా ఏపీ కేబినెట్ లో కీల‌క మంత్రిగా చ‌క్రం తిప్పేస్తున్నారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీ అధినేత కుమారుడిగా - పార్టీలో నెంబ‌ర్ టూగా భావిస్తున్న లోకేశ్ ఎమ్మెల్సీ ద్వారా చ‌ట్ట‌స‌భ‌లోకి ప్ర‌వేశించ‌డంపై ఇప్ప‌టికే విప‌క్షాల‌న్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. దొడ్డిదారిన చ‌ట్ట‌స‌భ‌లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేశ్... ప్ర‌జ‌ల‌కు ఏం ఒర‌గ‌బెడ‌తార‌ని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టేందుకైనా ఈ ద‌ఫా లోకేశ్ అసెంబ్లీ బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌దు. ఆ దిశ‌గానే టీడీపీ కూడా పావులు క‌దుపుతోంది.

అయితే ఎంతైనా పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న లోకేశ్ ఓడితే బాగోదు క‌దా... అందుకే సేఫ్ డెన్ ఏద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌ల మీద విశ్లేష‌ణ‌లు చేస్తున్న పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఇప్ప‌టికీ స‌ద‌రు సేఫ్ జోన్‌ ను క‌నిపెట్టలేక‌పోయార‌నే చెప్పాలి. అయితే లోకేశ్ గ‌నుక త‌మ స్థానాల నుంచి పోటీ చేస్తే... తాము స్వ‌చ్ఛందంగా త‌ప్పుకుని త‌మ సీట్ల‌ను త్యాగం చేస్తామంటూ ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌న్నింటినీ ప‌క్క‌న పెట్టేసిన టీడీపీ అధిష్ఠానం విశాఖ జిల్లా భీమిలి అయితే బాగుంటుంద‌ని భావిస్తోంద‌ట‌. దీనికి అనుగుణంగా ఇప్ప‌టికే లీకులు కూడా ఇచ్చేసింది. అయితే అనూహ్యంగా ఇక్క‌డ నుంచి లోకేశ్ కు నో ఎంట్రీ బోర్డు ప‌డిపోయింది. ఆ బోర్డు పెట్టింది మ‌రెవ‌రో కాదు.... అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావే.

నిజ‌మా? అంటే... నిజ‌మేనండీ బాబూ. ఈ మాట‌ను వేరెవ‌రితోనే చెప్పించ‌కుండా స్వ‌యంగా ఆయ‌నే చెప్పేశారు. ఈ విష‌యంపై గంటా ఏమ‌న్నారన్న విష‌యానికి వ‌స్తే... *లోకేశ్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నాకు పత్రికల ద్వారా తెలిసింది. నేను ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే చెప్పేశాను. ఒకవేళ ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు ఆదేశిస్తే శిరసావహిస్తా. పార్టీకి సేవ చేసుకుంటా* అని గంటా న‌ర్మ‌గ‌ర్బంగా వ్యాఖ్యానించారు. మ‌రి నో ఎంట్రీ బోర్డు ప‌డిన చోట నుంచి లోకేశ్ ఎలా పోటీ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News