హైవేల‌పై టోల్‌ప్లాజాల స్థానంలో `జీపీఎస్` వ్య‌వ‌స్థ‌.. కేంద్రం కొత్త ఆలోచ‌న‌

Update: 2021-08-13 00:30 GMT
జాతీయ ర‌హ‌దారుల  అభివృద్ధికి, నిర్మాణాల‌కు సంబంధించి దేశంలో కొన్ని ద‌శాబ్దాలుగా.. టోల్ ప్లాజాల  వ్య‌వ‌స్థ న‌డుస్తోంది. జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణించే వాహ‌నాల నుంచి కొంత రుసుమును వ‌సూలు చేయ‌డం.. ఈ ప్లాజాల ప‌ని. నిర్ణీత ప‌రిధిలో ఈ ప్లాజాలు ఏర్పాటు చేసి.. వాహ‌నాల నుంచి టోల్ వ‌సూలు చేస్తున్నారు. సాధార‌ణ స‌మ‌యాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ర‌ద్దీ స‌మయాల్లో మాత్రం ప్లాజాల వ‌ద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ ర‌ద్దీని త‌గ్గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనేక చర్య‌లు చేప‌ట్టింది.

ప్ర‌ధానంగా గ‌త ఏడాది కాలంలో `ఫాస్ట్ ట్యాగ్` వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చింది. ముందుగానే ఈ యాప్‌లో రీచార్జ్ చేసుకోవడం ద్వారా.. టోల్ ప్లాజా వ‌ద్ద‌కు వాహ‌నం రాగానే ఆటోమేటిక్‌గా రుసుము డిడెక్ట్ అయి.. గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుంది. దీంతో ఎలాంటి ర‌ద్దీ లేకుండా.. టోల్ ప్లాజాల వ‌ద్ద ఎలాంటి వెయిటింగ్ లేకుండానే వాహ‌నాలు ముందుకు సాగిపోయే వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తెచ్చారు. జాతీయ ర‌హ‌దారులు, ఉప‌రిత ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గ‌డ్క‌రీ.. ఈ విష‌యంలో చాలా చురుగ్గా ఉన్నారు.

ఫాస్టాగ్ వ‌ల్ల‌.. కేంద్ర ప్ర‌భుత్వం రెండు ప్ర‌యోజ‌నాల‌ను  ఆశిస్తోంది. ఒక‌టి.. టోల్ ప్లాజాల వ‌ద్ద‌.. అవినీతి, రెండు ప్ర‌యాణికుల‌కు వేచి చూసే ధోర‌ణి లేకుండా చేస్తోంది. అంతేకాకుండా.. ప్ర‌యాణికుల‌కు సేవ‌లు అందించ‌డం సుల‌భ‌మ‌వుతుంద‌ని కూడా కేంద్రం భావిస్తోంది. ఇక‌,.. ఇప్పుడు తాజాగా మ‌రో వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తేనున్న‌ట్టు మంత్రి గ‌డ్క‌రీ తెలిపారు. సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..  మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై టోల్‌ సేకరణ కోసం ప్లాజాలకు బదులుగా.. కేంద్రం జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను తీసుకురాబోతుందని ప్రకటించారు.

దీనికి గాను రాబోయే మూడు నెలల్లో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సేకరణ వ్యవస్థ వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుందన్నారు. ఇది వ‌స్తే.. మ‌రింత పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందుబాటులోకి రావ‌డంతోపాటు.. ప్ర‌యాణికుల‌కు అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే టోల్ ధ‌ర‌లు దిగి వ‌స్తాయ‌ని తెలిపారు. అయితే.. దీనికి సంబంధించిన సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేస్తున్నామ‌న్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తామ‌న్నారు.
Tags:    

Similar News