మ‌ళ్లీ స‌మైక్యాంధ్ర‌ను తెచ్చేందుకు కుట్ర‌

Update: 2018-12-04 09:29 GMT
తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం శిఖ‌ర స్థాయికి చేరుకున్న నేప‌థ్యంలో నేత‌ల వెంట మ‌ళ్లీ తెలంగాణ వాదం, స‌మైక్యాంధ్ర వాదం వంటి మాట‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించ‌ని నాటికి ముందు ఉన్న ప‌రిస్థితుల‌ను ప్ర‌జ‌ల‌కు గుర్తుచేస్తూ టీఆర్ఎస్ ప్ర‌చారంలో దూసుకుపోతోంది. తెలంగాణ ఏర్ప‌డ్డాక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ లూటీ చేసింద‌ని ఆరోపిస్తూ ప్ర‌జా కూట‌మి నేత‌లు దీటుగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.

తాజాగా టీఆర్ఎస్ ముఖ్య నేత హ‌రీశ్ రావు వెంట తీవ్ర విమ‌ర్శ‌ల‌తో ప్ర‌జా కూట‌మిపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌ను ఏపీలో క‌లిపి మ‌ళ్లీ స‌మైక్యాంధ్ర‌ను తీసుకొచ్చేందుకు ఇప్పుడు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. తెలంగాణ రాకుండా ఆఖ‌రి నిమిషం వ‌ర‌కు అడ్డుప‌ట్ట టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్‌తో చేతులు క‌ల‌ప‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో ఈ మేర‌కు హ‌రీశ్ ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ప్ర‌జా కూట‌మి పై దుమ్మెత్తిపోశారు.

తెలంగాణ‌లో తెలంగాణ పౌరులే పోటీ చేయాల‌ని.. స్థానిక వ్య‌క్తులే అధికారంలో ఉండాల‌ని హ‌రీశ్ ఆకాంక్షించారు. కానీ టీడీపీ - కాంగ్రెస్ జ‌త క‌ట్ట‌డంతో ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింద‌న్నారు. పొరుగు రాష్ట్ర నేత‌లు తెలంగాణ‌లో అధికారం చేజిక్కించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఒక మంత్రిగా కాకుండా తెలంగాణ ఉద్య‌మకారుడిగా తాను మాట్లాడుతున్నాన‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు చంద్ర‌బాబు చేతిలో కీలుబొమ్మ‌ల‌య్యార‌ని విమ‌ర్శించారు.

1956లో కాంగ్రెస్‌ నేతలు ఉపముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణను ఏపీలో కలిపార‌ని హ‌రీశ్ రావు అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి కుట్రే జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ప్ర‌జా కూటమిలో మిగిలింది కాంగ్రెస్ - టీడీపీలేనని.. కోదండరాం - సీపీఐ చాడ వెంకటరెడ్డిల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ‌కు చంద్ర‌బాబు గ‌తంలో చాలా అన్యాయాలు చేశార‌ని హ‌రీశ్ ఆరోపించారు. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీని తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కరెంటు కష్టాలపై నిలదీసినందుకు బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపించిన చరిత్ర చంద్రబాబుది కాదా అని నిల‌దీశారు. 2014లో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తిరిగి తెలుగుజాతిని కలిపే శక్తి ఒక్క టీడీపీకే ఉందన్న బాబు మాటలకు అర్థమేంటని హ‌రీశ్‌ ప్రశ్నించారు. ఏపీలో తెలంగాణ‌ను విలీనం చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండి కూట‌మి కుట్ర‌ల‌ను భ‌గ్నం చేయాలంటూ పిలుపునిచ్చారు.
Tags:    

Similar News