ఒక్క‌సారి ప్రారంభ‌మ‌య్యాక‌...తాము జోక్యం చేసుకోలేం

Update: 2021-11-11 06:30 GMT
ఎన్నికల ప్రక్రియ అనేది ఒక్కసారి ప్రారంభం అయిన తర్వాత , మేము ఆ ఎన్నికల ప్రక్రియ లో జోక్యం చేసుకోలేం అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌లువురు అభ్య‌ర్థుల నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డంపై హైకోర్టులో ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వీటిపై జ‌స్టిస్ దొన‌డి ర‌మేశ్ విచార‌ణ జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరస్క‌ర‌ణ‌కు గురైన నామినేష‌న్ల‌పై తాము ఎట్టి ప‌రిస్థితుల్లో జోక్యం చేసుకోలేమ‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌పై అభ్యంత‌రం వుంటే ఎన్నిక‌ల పిటిష‌న్ దాఖ‌లు చేసుకోవ‌డం మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని గ‌తంలో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యాన్ని జ‌స్టిస్ ర‌మేశ్ గుర్తు చేశారు.

దురుద్దేశపూర్వకంగా నామినేషన్లు తిరస్కరించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆర్వోలను ప్రతివాదులుగా చేరిస్తే నోటీసులిచ్చి వివరణ కోరతామని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తమ నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలు కల్పించేలా ఆర్వోలను ఆదేశించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వారి అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఆదేశాలిచ్చారు. ఓ సారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు కలుగజేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు ధర్మాసనం తీర్పులు ఇచ్చాయని గుర్తుచేశారు.

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్లో తన నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ అభ్యర్థి జి.మహేంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అలాగే కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 17వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న తన నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించడంపై షేక్‌ జాఫర్‌ అలీ హైకోర్టును ఆశ్రయించారు.ఇదే అంశంపై మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇవన్నీ బుధవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎన్‌.అశ్వనీకుమార్‌, కే.ఎం కృష్ణారెడ్డి, కంభంపాటి రమేశ్‌బాబు తదితరులు వాదనలు వినిపించారు. స‌రైన‌ కార‌ణాలు లేకుండా నామినేష‌న్లు తిర‌స్క‌రించార‌న్న పిటిష‌న‌ర్ల‌ ఆరోప‌ణ‌లపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని, ఆయా రిట‌ర్నింగ్ అధికారుల‌ను ధ‌ర్మాస‌నం ఆదేశించింది. విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 8కి వాయిదా వేసింది.



Tags:    

Similar News