ట్రంప్ జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రిపిన హిందూసేన‌

Update: 2016-06-14 14:39 GMT
శ‌త్రువు శ‌త్రువు మిత్రుడు అనే నానుడి నిజం చేసేందుకు ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ  త‌ర‌ఫున బ‌రిలో దిగ‌డం దాదాపుగా ఖ‌రారైన‌ డోనాల్డ్ ట్రంప్ జన్మదిన వేడుకలు "హిందూసేన" నిర్వ‌హించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ వేడుక‌లు ఘనంగా జరిగాయి. 20 మంది స‌భ్యులున్న హిందుసేన‌ బృందం కేక్ క‌ట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మీడియాను కూడా ఆహ్వానించారు. ఇస్లామిక్ మిలిటెంట్ల‌పై ట్రంప్ అవ‌లంభిస్తున్న క‌ఠిన వైఖ‌రి త‌మ‌కు స్ఫూర్తిగా నిలుస్తోంద‌ని సేన నేత విష్ణుగుప్తా తెలిపారు. ట్రంప్ భ‌విష్య‌త్తు అమెరికా రాజు అంటూ కీర్తించారు. గ‌త నెల‌లో కూడా ఈ బృందం స‌భ్యులు ట్రంప్‌ను గెలిపించాలంటూ ప్ర‌త్యేకంగా పూజ‌లు నిర్వ‌హించారు.

అమెరికా అధ్య‌క్ష పోరులో ఉన్న ట్రంప్ ముస్లింల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ముస్లింల వ‌ల్లే అంత‌ర్జాతీయంగా ఉగ్ర‌వాదం పెరిగిపోతోంద‌ని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా నైట్ క్ల‌బ్‌లో దాడి జ‌రిగిన సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తూ ఇప్ప‌టికైనా ముస్లింల‌ను దూరం పెడితే మేల‌నే భావ‌న‌ను వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో హిందూ ఉగ్ర‌వాదంపై దండెత్తే హిందూసేన ట్రంప్ పుట్టిన‌రోజును నిర్వ‌హించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News