హైదరాబాద్ మెట్రో రైలు అన్ని స్టేషన్లలో ఆగదా?

Update: 2020-05-13 12:30 GMT
ప్రస్తుతం చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసిన వైనం తెలిసిందే. ఇప్పటికి హైదరాబాద్ మెట్రో సర్వీసుల్ని బంద్ చేసి దగ్గర దగ్గర ఎనిమిది వారాలవుతుంది. మరెన్ని వారాల పాటు నిలిపివేస్తారన్నది ప్రశ్నగా మారింది.
దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యం తో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. ప్రస్తుతం భారీగా నష్టాల్ని మూటగట్టుకుంటోంది. మాయదారి రోగం ఎక్కడ అంటుకుంటుందన్న ఉద్దేశంతో రైళ్లను నిలిపివేస్తే.. భౌతిక దూరం కారణాలతో హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో నిర్వహించే మాల్స్ ను మూసివేశారు.

నెలకు రూ.45 కోట్ల ఆదాయంతో లాభం.. నష్టం లేని పరిస్థితులకు హైదరాబాద్ మెట్రో చేరుకున్న సమయంలోనే లాక్ డౌన్ తెర మీదకు రావటంతో.. భారీగా నష్టాల్ని మూటగట్టుకుంటోంది. వీలైనంత త్వరగా మెట్రోను నడపాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ మెట్రోలోని మూడు బోగీల్లో వెయ్యి వరకూ ప్రయాణికులు ప్రయాణించేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని.. నాలుగైదు వందల కంటే ఎక్కువగా అనుమతించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాద్ మెట్రో పరిధిలోని కొన్ని స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్దగా ఆదరణ లేని.. ఆదాయం అంతంతమాత్రంగా ఉన్న స్టేషన్లను నిలిపివేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

వీలైనంతగా ఖర్చుల్ని తగ్గించుకోవాలన్న యోచనలో ఉన్న మెట్రో.. ప్రత్యేక పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చే వరకూ ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సుమారు కిలోమీటరుకు ఒక స్టేషన్ ఉన్న నేపథ్యంలో.. రద్దీగా లేని స్టేషన్లను నిలిపవేయటం ద్వారా ప్రజలకు సమస్యలు ఎదురుకావని మెట్రో వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా.. ఈసారి మెట్రో రైలు ప్రారంభం గతానికి భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News