ఆ గ‌వ‌ర్న‌ర్ కు షాకిచ్చిన హ్యాక‌ర్లు!

Update: 2019-05-01 05:51 GMT
మోడీ ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ప‌లు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. సాధార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ల ఎంపిక మొత్తం.. అధికార పార్టీలో సుదీర్ఘ‌కాలం సేవ‌లు అందించిన సీనియ‌ర్ నేత‌ల‌కు.. లేదంటే అత్యంత విధేయుల‌కు ఇవ్వ‌టం ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న‌దే. దీనిపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేసినప్ప‌టికి.. అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌తి పార్టీ ఇదే తీరును అనుస‌రించ‌టంతో గ‌వ‌ర్న‌ర్ల ఎంపిక విధానం ఒకే తీరులో ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  

ఈ తీరుకు మోడీ మాష్టారు మిన‌హాయింపు కాదు. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత పూర్తిస్థాయి మెజార్టీతో ఉన్న మోడీ స‌ర్కారు.. గ‌వ‌ర్న‌ర్ల ఎంపిక‌లో త‌మ ముద్ర‌ను కొట్టొచ్చిన‌ట్లుగా వేశార‌ని చెప్పాలి. ఈ కార‌ణంగా కొన్ని రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల పాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారి.. త‌ర‌చూ వార్తల్లోకి ఎక్కే ప‌రిస్థితి. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌త్య‌పాల్ మాలిక్ గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. ఆయ‌న తీరును రాజ‌కీయ పార్టీలు అదే ప‌నిగా త‌ప్పు ప‌డుతుంటాయి. ఇదిలా ఉండ‌గా.. ఆయ‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. ఆయ‌న ఖాతాను హ్యాక్ చేసిన హ్యాక‌ర్లు.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు ఫాలోవ‌ర్ గా చూపించారు. దీంతో అకౌంట్ కు అవ‌స‌ర‌మైన మార్పులు చేశారు.

ఈ వ్య‌వ‌హారానికి కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. హ్యాక‌ర్ల‌ను గుర్తించాల్సిందిగా కోరుతూ జ‌మ్ముక‌శ్మీర్ పోలీసుల‌కు రాజ్ భ‌వ‌న్ ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం ఈ ఉదంతంపై విచార‌ణ జ‌రుగుతోంది.
Tags:    

Similar News