వైసీపీలో గుబులు రేపుతున్న జనసేన.. ?

Update: 2021-11-10 03:30 GMT
జనసేన. ఏపీలో పెద్దగా బలం లేదు. అది మాకు పోటీయే కాదు, ఇలా ఉంటాయి వైసీపీ పెద్దల మాటలు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలలో జనసేన గుబులు స్టార్ట్ అయింది అంటున్నారు. చాప కింద నీరులా మెల్లగా జనసేన విస్తరిస్తోందని, ప్రత్యేకించి బలమైన సామాజిక వర్గానికి చెందిన వారంతా ఇపుడు ఆ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు పసిగడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే నికరం అయితే మాత్రం తట్టుకోవడం కష్టమే అన్న అంచనాకు కూడా వస్తున్నారు. జనసేన బలం ఎక్కడ ఉంది అని ప్రశ్నించేవారికి ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాలలోని బలమైన సామాజిక వర్గం ఉన్న చోట ఒకసారి వచ్చి క్షేత్ర స్థాయిలో చూస్తే వాస్తవాలు అర్ధమవుతాయని అంటున్నారు.

విశాఖ జిల్లాలో చూసుకుంటే బలమైన కాపు సామాజికవర్గం ఉన్న నియోజకవర్గాలు అరడజన్ కి పైగానే ఉన్నాయి. గాజువాక. విశాఖ నార్త్, భీమిలీ, గాజువాక, పెందుర్తి, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం వంటి చోట్ల గెలుపు గుర్రం ఆ సామాజిక వర్గమే అని గట్టిగా చెప్పి తీరాల్సిందే. ఇక రెండున్నరేళ్ళ వైసీపీ పాలన పూర్తి అయింది. మెల్లగా వాస్తవాలు తెలుస్తున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో నెగ్గుకురావడం ఎలా అన్న టెన్షన్ అయితే అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. గతంలో కంటే కూడా ఇపుడు కాపు ఓట్లు బాగా కన్సాల్డేట్ అవుతున్నాయి. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి.

దాంతో మరో ఏడాది వ్యవధిలోనే విశాఖ సహా ఏపీ రాజకీయాల్లో సంచలనాలు ఉంటాయా అన్న చర్చ కూడా సాగుతోంది. సాధారణంగా ప్రతీ ఎన్నికకూ జంపింగ్స్ అటూ ఇటూ ఉంటాయి. ఈసారి తమకు ఇబ్బంది వస్తుందని ముందుగా పసిగట్టే వారు కూడా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. ఆ విధంగా విశాఖ రూరల్ జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే జనసేన నేతలతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆయన ఆలోచనలు ఏమిటో అన్నది అర్ధం కావడంలేదు అంటున్నారు. నిజానికి ఆయనకు వైసీపీలో బాగా కంఫర్ట్ గానే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆ సామజిక వర్గం ఓట్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో భాగమా, లేక నిజంగా గాలి వాలుని బట్టి గట్టు దాటే యత్నమా అన్నది కూడా చూడాలి. మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గం మాత్రం గుంభనంగా ఉంది. అది బయటపడాలంటే కొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు.
Tags:    

Similar News