కమల్ హాసన్.. సంచలనాలు నమోదు చేయగలడా!

Update: 2019-03-31 07:36 GMT
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాట తన పార్టీని బరిలో నిలిపిన నటుడు కమల్ హాసన్ ప్రభావం ఏమిటి? అనేది ఆసక్తిదాయకంగా మారింది. తమిళనాట కమల్ ను చేర్చుకోవడానికి ఏ పార్టీ అయినా రెడీగానే కనిపించింది. కమల్ సొంత పార్టీనే పెట్టుకున్నా.. ఆయనతో పొత్తుకు రెడీ అని  కూడా పార్టీలు ప్రతిపాదించాయి. ప్రత్యేకించి డీఎంకే అన్ని పార్టీలనూ కలుపుకుపోయే ప్రయత్నంలో భాగంగా కమల్ తో కూడా పొత్తుకు సై అన్నట్టుగా వ్యవహరించింది.

గతంలో డీఎంకే సపోర్టర్ లా కనిపించిన కమల్ మాత్రం స్టాలిన్ నేతృత్వంలోని ఆ పార్టీతో చేతులు కలపలేదు. సోలోగా సత్తా చూపిస్తూ ఉన్నాడు. కమల్ పార్టీ తరఫున ఎంపీ స్థానాల కోసం బరిలోకి దిగుతున్న నేతల్లో దాదాపు అందరికీ క్లీన్ ట్రాక్ రికార్డు ఉందట.

కమల్ గొప్ప నటుడే కానీ.. మరీ మాస్ ఇమేజ్ ఉన్న హీరో కాదు. తమిళనాట కమల్ కు భారీగా అభిమానగణం అయితే ఉంది. అదొక్కటే రాజకీయంగా విజేతగా నిలుపుతుందని అనుకోవడం అమాయకత్వమే. కమల్ కన్నా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా రాజీకీయాల్లోకి వచ్చి ఫెయిల్యూర్ అయిన దాఖలాలున్నాయి. అలాంటిది కమల్ ఏం సాధించగలడు అనేది కొశ్చన్ మార్కే.

మాస్ ఇమేజ్ పెద్దగా లేని కమల్ తరఫున అభ్యర్థులు గెలిచేంత స్థాయి ఓట్లను సంపాదిస్తారా అనేది అనుమానమే. కానీ ఒకటైతే అభినందించదగిన అంశం. కమల్ హాసన్ పొత్తు రాజకీయాలు వంటి వాటికి పూర్తిగా దూరంగా నిలిచాడు. ఓట్లు - సీట్లు లెక్కలు వేసి ఏదో ఒక పార్టీతో కలుపుకుని వెళ్లడానికి కమల్ ఆరాటపడలేదు. ఈ రకంగా అయితే కమల్ అభినందనీయుడే. ఇక ఆయనను, ఆయన పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారనే అంశం ఎన్నికల ఫలితాలతో గానీ తెలియదు.

అయితే కమల్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళ ప్రజలను తీవ్రంగానే విసిగించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద డీఎంకే చాలా ఆశలు పెట్టుకుంది. ఆ ఓటులో కొద్ది శాతాన్ని అయినా కమల్ చీల్చడం మాత్రం ఖాయం!
Tags:    

Similar News