కొడాలి కోసం వేట.. రంగంలోకి దిగిన గుడివాడ పోలీసులు
కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగిస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.;
కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగిస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో కొడాలితోపాటు ఆయన అనుచరులపై నమోదైన కేసుల్లో విచారణకు హాజరుకావాలంటూ గుడివాడ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఈ ఊహించని పరిణామంతో కొడాలితోపాటు ఆయన అనుచరులు షాక్ తిన్నారని అంటున్నారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన ముగ్గురు నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరని చెబుతుంటారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు కొడాలి, మరో మాజీ మంత్రి పేర్ని నానిలను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీని గత నెలలో అరెస్టు చేయగా, బందరు బియ్యం అక్రమ తరలింపు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పేర్ని నానికి ఈ రోజే ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో కొడాలిపై పోలీసులు ఫోకస్ చేశారు. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ మాజీ మంత్రి కొడాలి, ఏపీ బెవరేజస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలతా రెడ్డిపై గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కొడాలి నానితో సహా నిందితులపై పోలీసులు 448, 427, 506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొడాలి సన్నిహితులు హైకోర్టును ఆశ్రయించడంతో 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. గుడివాడలో కొడాలికి షాడో నేతలుగా చలమాణి అయిన దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. వలంటీర్లను రాజీనామా చేయించడం, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో వీరు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిచ్చే స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కొడాలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అయితే ఈ రెండు కేసుల్లో కొడాలికి ప్రస్తుతం ముందస్తు బెయిల్ మంజూరైందని అంటున్నారు. దీంతో కొడాలిపై చర్యలకు ఇతర మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని చెబుతున్నారు.