క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. బీజేపీ ఇలా.. కాంగ్రెస్ అలా.. రెంటికీ ఇంటిపోరే!!

Update: 2023-04-16 09:58 GMT
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ను ప్రాణ‌ప్ర‌దంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. క‌ర్ణాట‌క‌లో ఎలానూ అధికారంలో ఉన్న బీజేపీ.. మ‌రోసారి ఇక్క‌డ పాగా వేసి.. మోడీ స‌త్తాను దేశానికి తెలియ‌జెప్పాల‌నే బిగ్ ప్లాన్ వేసుకుంది. వ‌చ్చే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇది మైలు రాయిగా మారుతుంద‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు. అంతేకాదు.. దేశంలో మోడీ హ‌వాకు తిరుగులేద‌ని చెప్ప‌డానికి కూడా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ను క‌మ‌ల నాథులు మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు.

ఇక‌, ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా త‌మ ప‌వ‌నాలు త‌గ్గిపోవ‌డంతోపాటు కేంద్రం నుంచి  ఎదురు దెబ్బ‌లు ఎదుర‌వుతున్న వేళ‌.. అత్యం త కీల‌క‌మైన ద‌క్షిణాదిలోని క‌ర్ణాట‌క‌లో అయినా.. అధికారం ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.

రాహుల్ స‌హా.. సోనియాకు కేంద్రం నుంచి ఇటీవ‌ల కాలంలో సెగ‌లు పెరుగుతున్నాయి. ఇక‌, కాంగ్రెస్ కూడా ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ ప‌రిణామాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక మాత్రం క‌ర్నాట‌క‌లో అధికారంలోకి రావ‌డ‌మే!

అయితే.. ఇంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న క‌ర్ణాట‌క‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెంటిలోనూ ఇంటి పోరు తీవ్ర‌స్థాయిలో జ‌రుగు తుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. బీజేపీ విష‌యాన్ని తీసుకుంటే.. కీల‌క‌మైన క‌ళ్యాణ క‌ర్నాట‌క ప్రాంతంలో మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కుడు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి సొంత పార్టీ పెట్టుకుని 40 స్థానాల్లో స‌వాల్ రువ్వుతున్నారు. ఈయ‌న‌ను దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌లించ‌లేదు. ఇక‌, మ‌రోవైపు.. సొంత పార్టీలోనే టికెట్లు ద‌క్క‌ని వారు వ‌రుస‌గా కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకొంటున్నారు.

మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు బీజేపీ అధిష్టానానికి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. దీంతో క‌మ‌ల నాథులకు సొంత పార్టీలోనే సెగ‌లు.. పొగ‌లు క‌క్కుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే కొన్ని స‌ర్వేలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారం ఖాయ‌మ‌ని చెప్పాయి. దీంతో పార్టీలో కీల‌క‌ నేత‌లు.. ప్ర‌చారంపై దృష్టి పెట్ట‌డం మానేసి.. సీఎం సీటు కోసం కొట్టుకుంటున్నారు. మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, ప్ర‌స్తుత క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప‌క్ష నాయ‌కుడు డీకే శివ‌కుమార్‌లు .. సీఎం సీటు రేసులో నువ్వా నేనా అన్న‌ట్టుగా ప‌రోక్షం పోరాటం చేస్తున్నారు.

దీంతో క్షేత్ర‌స్తాయిలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారంపై ఎవ‌రూ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా.. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు ఇంటిపోరులో మునిగిపోవ‌డం గ‌మ‌నార్హం.

Similar News