క‌ర్ణాట‌క ఎన్నికల్లో అన్ని వేల కోట్లు ఖ‌ర్చు చేశారా?

Update: 2018-05-10 06:10 GMT
దేశ రాజ‌కీయాల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌టంతో పాటు.. వ‌చ్చే ఏడాది జ‌రిగే  సార్వ‌త్రిక ఎన్నికల‌పైనా ప్ర‌భావాన్ని చూపించేలా క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాంగ్రెస్‌.. బీజేపీల‌కు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితం వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీంతో.. తుది ఫ‌లితం త‌మ‌కు అనుకూలంగా వ‌చ్చేలా చేయ‌టం కోసం ప్ర‌తి పార్టీ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతోంది.

ద‌క్షిణాదిన కాషాయ జెండా రెప‌రెప‌లు క‌ర్ణాట‌క‌తో షురూ కావాల‌ని.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు గుడ్ స్టార్ట్ గా క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితం ఉండాల‌ని బీజేపీ భావిస్తుంటే.. ఇప్ప‌టికి ఎదురైన ఓట‌మి ప‌రంప‌ర‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి.. త‌మ స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారైనా త‌మ స‌త్తా చాట‌కుంటే.. త‌మ ఉనికికే ప్ర‌మాద‌మ‌ని జేడీఎస్ ఫీల‌వుతోంది. ఇలా.. ప్ర‌తి పార్టీకి కీల‌కంగా మారిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ప‌ట్టు కోసం వేలాది కోట్ల రూపాయిల్ని ఖ‌ర్చు చేయ‌టానికి పార్టీలు ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు.

ఒక రాష్ట్రంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు ఆ రాష్ట్ర రాజ‌కీయాన్ని ప్ర‌భావితం చేయ‌టం మామూలే. కానీ.. అందుకు భిన్నంగా క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జాతీయ‌స్థాయిలోనూ ప్ర‌భావం చూప‌ట‌మే కాదు.. కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర తీసేలా చేస్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ శ‌క్తికి మించి మ‌రీ ఖ‌ర్ఛు చేసేందుకు రాజ‌కీయ పార్టీలు వెనుకాడ‌టం లేదు.

ప్ర‌తి పార్టీకి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక అంచ‌నా ప్ర‌కారం దాదాపు రూ.25వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో క్యాష్ ఫ్లో విష‌యంలో తేడా కొట్టేసిన వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

రాష్ట్ర బ‌డ్జెట్‌లో పావుశాత‌మైన మొత్తం ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఖ‌ర్చు కావ‌టంతో.. న‌గ‌దు ల‌భ్య‌తపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుందంటున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో పెద్ద ఎత్తున న‌గ‌దు చేతులు మారిన నేప‌థ్యంలో రాష్ట్రాల‌కు వ‌చ్చే క్యాష్ ఫ్లో మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. తెలంగాణ‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌..ప‌లు రాష్ట్రాల్లో ఎటీఎంలు వ‌ట్టి పోవ‌టం వెనుక క‌ర్ణాట‌క ఎన్నిక‌ల పుణ్య‌మేన‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేసేందుకు పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తున్న పార్టీ కార‌ణంగా న‌గ‌దు ల‌భ్య‌త‌లో కొర‌త ఎదుర‌వుతుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌లు జ‌రిగిన ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ ఎత్తున ఖ‌ర్చు చేయ‌లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News