క‌ర్ణాట‌క ఎన్నిక‌లు: 40 శాతం క‌మీష‌న్ల‌పై '4 శాతం రిజ‌ర్వేష‌న్ల' ప్ర‌భావం ఎంత‌?

Update: 2023-04-23 17:00 GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఎటు చూసినా.. 4 శాతం రిజ‌ర్వేష‌న్ల అంశం.. ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముస్లిం సామాజిక వ‌ర్గాల‌కు కాంగ్రెస్ హ‌యాంలో ప్ర‌క‌టించి, అమ‌లు చేసిన 4 శాతం రిజ‌ర్వేష‌న్‌ను ఇటీవ‌ల ఎన్నికల‌కు ముందు.. బీజేపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. నిజానికి ర‌ద్దు చేయాల‌ని అనుకుంటే.. అధికారం లోకి వ‌చ్చిన 2019లోనే ర‌ద్దు చేసి ఉండాల్సింది. కానీ, అలా చేయ‌కుండా.. రాజ‌కీయ ఆనుపానులు గుర్తిం చి బీజేపీ అడుగులు వేసింది.

ఈ క్ర‌మంలో ఈ 4 శాతం రిజ‌ర్వేష‌న్ ను కీల‌క‌మైన సామాజిక వ‌ర్గాలు వ‌క్క‌లిగ‌, లింగాయ‌త్‌ల‌కు.. బీజేపీ క‌ట్ట‌బెట్టింది. ఇది ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహాల‌ను.. ఎన్నిక‌ల ప‌రిస్థితిని కూడా స‌మూలంగా మార్చేస్తుంద‌ని క‌మ‌ల‌నాథుల లెక్క‌లుచెబుతున్నాయి. నిజానికి బీజేపీ పాలిత క‌ర్నాట‌క‌లో కొన్నాళ్లుగా 40 శాతం క‌మీష‌న్ వ్య‌వ‌హారం తార‌స్థాయికి చేరుకుంది. త‌మ ప‌నుల‌కు ప్ర‌భుత్వ పెద్ద‌లు.. మంత్రులు కూడా 40 శాతం క‌మీష‌న్ అడుగుతున్నారంటూ. ఒక కాంట్రాక్ట‌ర్ ఏకంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

మ‌రికొంద‌రు కాంట్రాక్ట‌ర్లు కూడా ఇదే చెప్పి..ప‌నులు చేయ‌లేమ‌ని చేతులు ఎత్తేశారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు కోటిన్న‌ర రూపాయ‌ల క‌మీష‌న్‌ను నెట్ క్యాష్ రూపంలో అందుకుని ఎమ్మెల్యే(బీజేపీ) కుమారుడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌జ‌ల్లో బీజేపీపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింద‌నే అంచ‌నాలు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలో అనూహ్యంగా రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌మీదికి తెచ్చిన బీజేపీ ముస్లింల‌కు 4 శాతం ర‌ద్దు చేసి.. దానిని వ‌క్క‌లిగ‌ల‌కు, లింగాయ‌త్‌ల‌కు పంచేసింది.

ఇది ఎన్నిక‌ల్లో త‌మ‌కు లాభిస్తుంద‌ని క‌మ‌ల నాథులు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అవినీతిని స‌హిం చ‌ని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు.. 40 శాతం క‌మీష‌న్‌పైనే కాకుండా.. కార్యాల‌యాల్లో అధికారులు లంచావ‌తారులుగా మారుతున్నారంటూ.. తాజాగా బెంగ‌ళూరులో బోర్డులు పెట్టారు.

ఆఫీసుల్లో లంచాల‌ను అరిక‌ట్టే వారికే త‌మ ఓటు అంటూ.. బెంగ‌ళూరు వాసులు ముక్తకంఠంతో చాటుతున్నారు. అంటే.. ఒక రెండు సామాజిక వ‌ర్గాల‌కు సానుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుతున్న లంచాల వ్య‌వ‌హారం .. స‌మ‌సిపోయేలా లేద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News