త‌మిళ టూరు త‌ర్వాత కేసీఆర్ మాట మారింది

Update: 2018-04-29 13:35 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త కామెంట్ చేశారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఫెడరల్ ఫ్రంట్‌లో అన్ని రాష్ర్టాలకు ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న సీఎం.. దేశహితం కోసం కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో, నాయకులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ - మాజీ ప్రధాని - జేడీఎస్ అధినేత దేవెగౌడ - కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత క‌రుణానిధి - అగ్ర‌నాయ‌కుడు స్టాలిన్‌ తో భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న ఆస‌క్తిక‌ర కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

చెన్నై విమానాశ్రయంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, డీఎంకే శ్రేణులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... డీఎంకేతో మొదటి యూపీఏ ప్రభుత్వంలో పని చేసినట్లు గుర్తు చేశారు. భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నారు. కేంద్రం రాష్ర్టాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు. స్టాలిన్‌తో చాలా అంశాలపై చర్చించానన్న సీఎం.. తెలంగాణలో మే 10 నుంచి మొదలుకాబోతున్న రైతు బంధు పథకం ప్రారంభం రోజున తెలంగాణకు రావాల్సిందిగా స్టాలిన్‌ను ఆహ్వానించామన్నారు. ఇది ప్రారంభం కాదు.. ముగింపు కాదు.. మరిన్ని చర్చలు జరుపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై మమతా బెనర్జీతో చర్చించామన్నారు. కేంద్రంతో సంబంధం లేని అంశాలను రాష్ర్టాలకు బదలాయించాలన్నారు. దేశంలో యువతకు మరిన్ని అవకాశాలు రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు.

ప్రస్తుతం పరిస్థితులు దేశాభివృద్ధికి సహకరించేలా లేవని, ఇందుకోసం దక్షిణాది రాష్ర్టాలు కలిసి రావాలని కేసీఆర్ కోరారు. `మేం చాలా అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం పోవాలి. మేం ఎవరితో కలిసి పనిచేస్తాం.. చేస్తున్నాం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మేమెప్పుడు ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. మీడియా ప్రసారం చేసింది` అని కేసీఆర్ ముగించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త‌నకు మంచి మిత్రుడని  సీఎం కేసీఆర్ అన్నారు. కూటమి ఏర్పాటుపై చంద్రబాబుతోనూ చర్చలు జరుపుతామని కేసీఆర్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News