వంద రోజుల్లో కాళేశ్వ‌రం పూర్తి అవుతుందా?

Update: 2019-01-03 08:52 GMT
ఊరికే కేసీఆర్ ఏ ప‌ని చేయ‌రు. ఆ మాట‌కు వ‌స్తే ఉత్త పుణ్యానికి ఒక మాట కూడా ఆయ‌న నోటి నుంచి రాదు. ప్ర‌తి దానికో లెక్క ప‌క్కాగా ఉంటుంది. అలాంటి కేసీఆర్ ఫాంహౌస్.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను వ‌దిలేసి ప్రాజెక్టుల పురోగ‌తిని ప‌రిశీలించేందుకు బ్యాక్ టు బ్యాక్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించిన ఆయ‌న వేగంగా ప‌నులు జ‌ర‌గ‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఏదైనా అనుమ‌తుల ప‌రంగా ప‌నులు నిదానిస్తుంటే వెంట‌నే ఆ సంగ‌తి చూడాల‌ని చెప్పారు.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి అనుమ‌తులు తీసుకోవాల‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఇక‌పై మూడు షిఫ్ట్ ల‌లో ప‌ని చేయాల‌న్న ఆదేశాన్ని జారీ చేశారు. ఏం చేస్తారో నాకు తెలీదు.. ఏప్రిల్ మొద‌టి వారానికైతే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి కావాల్సిందేన‌న్న టార్గెట్‌ను విధించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నులు రానున్న వంద రోజుల్లో పూర్తి కావాలంటూ కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన మాట వెనుక అర్థం ఏమిటి? ప‌ర‌మార్థం ఏమైనా ఉందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.

ఏప్రిల్ మొదటివారానికి కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి కావాల‌న్న కేసీఆర్ తాజా టార్గెట్ వెనుక ప‌క్కా వ్యూహం ఉందని చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే వేళ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి అయ్యింద‌న్న మైలేజీ అధికార‌ప‌క్షానికి భారీ లాభాన్ని క‌లిగించ‌టం ఖాయం. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విద్యుత్ విజ‌యాన్ని భారీగా ప్ర‌చారం చేసిన కేసీఆర్‌.. దానికి త‌గిన ప్ర‌యోజ‌నాన్ని పొందారు. తాము రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి చేసిన‌ట్లు చెప్ప‌టం ఖాయం. త‌మ‌కు పూర్తిస్థాయిలో అధికారాన్ని ఇస్తే.. తెలంగాణ కోసం మ‌రింత క‌సిగా ప‌ని చేయ‌టానికి అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న మాట‌తో పాటు.. కేంద్రం మెడ‌లు వంచ‌టానికి అవ‌కాశం ఉంటుంద‌న్న మాట చెప్ప‌టం ఖాయం.

తెలంగాణ రాష్ట్ర ప‌రిధిలోని 17 ఎంపీ స్థానాల‌కు మ‌జ్లిస్ కు ఒక‌టి మిన‌హాయిస్తే.. మిగిలిన 16 స్థానాల్ని స్వీప్ చేసేలా విజ‌యాన్ని ఇవ్వాల‌న్న అభ్య‌ర్థ‌న‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టు చ‌క్క‌గా ప‌నికి వ‌స్తుంద‌ని.. ఆ లెక్క‌తోనే కేసీఆర్ తాజా టార్గెట్ విధించి ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏప్రిల్ నాటికి మొత్తం కాకున్నా.. పూర్తి అయ్యే ద‌శ‌కు తీసుకెళ్లినా.. తిరుగులేని మెజార్టీతోనే ఇలాంటివి సాధ్య‌మ‌వుతాయ‌న్న మాట‌ను చెప్పి.. తాను అనుకున్న 16 సీట్ల‌ను సొంతం చేసుకోవ‌టానికి వీలుగా త‌న వాద‌న‌ను కేసీఆర్ వినిపిస్తార‌ని చెబుతున్నారు.


Full View

Tags:    

Similar News