కేసీఆర్ కత్తి తీశారు..ఏబీఎన్ రాధాకృష్ణకు ఇబ్బందేనబ్బా?

Update: 2019-05-22 16:39 GMT
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మధ్య కొనసాగుతున్న దాగుడు మూతలు దాదాపుగా తొలగిపోయినట్టే. ఆదిలో సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ...  ఆ తర్వాత ఎలాగోలా రాజీ చేసుకున్నారు. అయితే ఈ దోస్తానా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి వరకే కొనసాగింది. ఎన్నికల సమయంలో తన పాత వైఖరినే చూపెట్టిన రాధాకృష్ణ... టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగానే వెళ్లారు. ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం - కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా ఏబీఎన్ తీరులో మార్పు రాలేదు. అంతేకాకుండా కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠను మరింత దిగజార్చేలా ఆంధ్రజ్యోతిలో వార్తలు ప్రచురితమవుతున్నాయి.

మొన్నటిదాకా ఓపిగ్గానే ఉన్న కేసీఆర్... అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆ అవకాశాన్ని కూడా ఆంధ్రజ్యోతే అందించినట్టైంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయిందని మొన్న ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ ఆ కథనాన్ని ఖండిస్తూ వివరణ కూడా ఇచ్చారు. అయినా తగ్గని ఆంధ్రజ్యోతి... నిన్న మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో తెలంగాణలోని మొత్తం అన్ని జిల్లాల్లో పనులు ఆగిపోయాయని - సర్కారు నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లంతా పనులు నిలిపివేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వరుస కథనాలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. ఏబీఎన్ రాధాకృష్ణకు లీగల్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారట.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న కోడ్ ముగియగానే... ఈ దిశగా ఏబీఎన్ పై మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కఠిన చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంలోకి వస్తే... ఏబీఎన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికకు కూడా యాడ్స్ నిలిపివేసే అవకాశాలున్నాయట. ఇప్పటికే ఈ రెండింటిపై అధికారులకు కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టుగానూ ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే... ఏబీఎన్ చేసిన తప్పునకు.. ఆ పత్రిక - టీవీ ఛానెల్  లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్లను కూడా రద్దు చేసే దిశగానూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా త్వరలోనే ఆంద్రజ్యోతికి తెలంగాణ లో గట్టి దెబ్బే తగలబోతోందన్న మాట.



Tags:    

Similar News