ఆంధ్రోళ్లు తెలంగాణకు రుణపడి ఉన్నారా?

Update: 2016-01-08 04:29 GMT
కింద పడ్డా పైచేయి అన్నోళ్లను ఇప్పటికి చాలామందినే చూసి ఉంటాం. కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అందుకు పూర్తి భిన్నమైన వెర్షన్. దెబ్బ పడి బొక్కబోర్లా పడి.. పైకి లేవటానికి అపసోపాలు పడుతుంటే.. కింద పడిపోవటం నీ గొప్పతనం.. కింద పడినా పైకి లేచేలా చేయటమంటే.. నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకు తెలిసేలా చేశా. అంత అద్భుతమైన అవకాశం నేను కాబట్టి ఇచ్చా. ఇంకెవరైనా ఇచ్చి ఉండేవారా? లాంటి ప్రశ్నలు సంధించి షాకుల మీద షాకులు ఇవ్వటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర విభజన కారణంగా ఇవాళ ఏపీ ఎంతగా ఇబ్బంది పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థిక ఇబ్బందులతో పూట గడవటం కష్టంగా ఉన్న ఏపీ సర్కారు.. ఏ రోజుకు ఆ రోజు గడిపేస్తున్న పరిస్థితి.

ఒకవైపు ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఈ విషయాల్ని అస్సలు పట్టించుకోక.. ఏపీకి కేంద్రం ఇచ్చిన ఐఐటీ.. ఐఐఎం గురించి ప్రస్తావించి ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పటం కేటీఆర్ కే చెల్లుతుంది. పూట గడవటం కష్టంగా ఉన్నోడికి.. కొత్త బట్టలు జత ఇస్తే ఏమవుతుంది? ఆ బట్టల్ని కుట్టించుకోవటానికి కూడా డబ్బులు కావాల్సిందే. ఆ డబ్బులు ఎవరు ఇస్తారా? అని ఆశగా ఎదురుచూసే దుస్థితి.

కానీ.. ఈ నిజాన్ని కేటీఆర్ అస్సలు ప్రస్తావించరు. ఎంతసేపటికి.. ఏపీకి ఇచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం.. ఐఐటీ.. ఐఐఎంల గురించి ప్రస్తావించి.. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణంగానే చోటు చేసుకుందని.. ఏపీ ఇంత అభివృద్ధి జరగటానికి కారణంగా తెలంగాణ మాత్రమే అని కితాబులు ఇచ్చుకోవటం కేటీఆర్ కే చెల్లుతుంది. ఒకవేళ ఆయన చెప్పినట్లు ఏపీకి అంత మేలే జరిగి ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిరి.. ఏపీ సీఎం కూడా తమది సంపన్న రాష్ట్రమని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? విభజన కారణంగా ఏపీకి ఎంతో అభివృద్ధి జరిగి ఉంటే.. హైదరాబాద్ లో ఉన్న ఏపీ క్యాడర్ సచివాలయ ఉద్యోగులు తమ కొత్త రాజధానికి తరలి వెళ్లటానికి ఎందుకు కిందామీదా పడుతున్నారు?

ఇలాంటి వాస్తవాల్ని కేటీఆర్ అస్సలు ప్రస్తావించరు. విభజనతో ఏపీకి పడిన ‘‘లోటు’’ పోటు గురించి మాట వరసకు మాట్లాడని కేటీఆర్.. ఐఐటీ.. ఐఐఎం.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులను మాత్రమే ప్రస్తావించటం గమనార్హం. విభజన కారణంగా పూర్తిగా నష్టపోయిన వారిని ఉద్దేశించి.. మీరు బాగా అభివృద్ధి చెందుతున్నారంటూ చెప్పటం చూస్తే.. ఏపీ ప్రజలు తెలంగాణకు రుణపడి ఉండాలన్నట్లుగా కేటీఆర్ మాటలు చెప్పకనే చెబుతాయి.

 రాష్ట్ర విభజనతో కిందామీదా పడుతున్న ఆంధ్రోళ్లు.. తమకంటూ రాజధాని లేని దుస్థితిలో.. స్కూలు పిల్లల దగ్గర రూ.10 చొప్పున వసూలు చేసి ఇటుకలు కొనుక్కునే (ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు తప్పు పట్టటం వేరే విషయం) పరిస్థితి కూడా రాష్ట్ర విభజనే అన్న విషయాన్ని కేటీఆర్ కు తెలియంది కాదు. అయితే.. ఇలాంటి విషయాలకు సైతం కేటీఆర్ మరెలాంటి అర్థం బయటకు తీస్తారో..?
Tags:    

Similar News