ఎయిర్ టెల్ ను మించిపోయేలా కేటీఆర్ మాటలు

Update: 2016-07-15 09:14 GMT
నిత్యం తమ గురించి తాము పొగుడుకోవటం అధికారపక్షానికి మామూలే. అయితే.. భిన్నంగా వ్యవహరిస్తూ.. తమ లోపాల్ని ఒప్పేసుకుంటూ మనసును దోచుకోవటం కొత్తగా మొదలైంది. నెట్ వర్క్ కు సంబంధించి ఎయిర్ టెల్ కస్టమర్లు తిట్టుకోవటం.. సిగ్నల్స్ సరిగా లేవని చెప్పుకోవటం మామూలే. ఇదే విషయాన్ని ఓపెన్ గా ఒప్పేసుకున్న ఎయిర్ టెల్ ఓపెన్ నెట్ వర్క్ అంటూ సరికొత్త ప్రచారాన్ని షురూ చేయటం తెలిసిందే.

తమలోని లోపాల గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నామంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న ఎయిర్ టెల్ కు తగ్గట్లే తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగర రోడ్ల మీద లక్షలాది మంది నిత్యం నరకయాతన అనుభవిస్తున్న నేపథ్యంలో.. ఆ విషయాన్ని ఓపెన్ గా ఒప్పేసుకుంటే బాగుంటుందని ఫీలయ్యారేమో కానీ.. తాజాగా ఆ పని పూర్తి చేశారు మంత్రి కేటీఆర్.

నోరు తెరిస్తే బంగారు తెలంగాణ గురించి బడాయి మాటలు చెప్పే దానికి భిన్నంగా.. హైదరాబాద్ లోని రోడ్లు.. డ్రైనేజీకి సంబంధించి పలు ఫిర్యాదుల నేపథ్యంలో అధికారుల తీరుపై కేటీఆర్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య ఆకస్మిక పర్యటన చేసిన ఆయన.. మూడు రోజుల క్రితం అర్థరాత్రి వేళ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి ఆకస్మిక పర్యటనలు చేసి రోడ్ల దుస్థితి మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తాజాగా మై జీహెచ్ ఎంసీ యాప్ ను ఆవిష్కరించే సందర్భంగా హైదరాబాద్ లోని రోడ్లు.. డ్రైనేజీ.. పుట్ పాత్ ల విషయం మీద ప్రజలకున్న అసంతృప్తిపై ఓపెన్ గా మాట్లాడిన ఆయన.. ఈ విషయం మీద ప్రజలు తమపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెప్పారు. రోడ్ల దుస్థితి మీద సామాన్యుడు మొదలు సీఎం వరకూ అందరూ అసంతృప్తిగానే ఉన్నట్లు చెప్పిన కేటీఆర్.. నాలుగు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామని.. త్వరలోనే హైదరాబాద్ నగరంలోని అన్ని సమస్యల్ని తీర్చనున్నట్లుగా వెల్లడించారు. కాకుంటే.. కాస్త టైం తనకు ఇవ్వాని కోరటం గమనార్హం. అధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండేళ్లు దాటుతుంది. ఇంకా.. టైం ఇవ్వాలనటం ఏమిటో..?
Tags:    

Similar News