సర్వేపై సంచలన విషయాలు చెప్పిన లగడపాటి

Update: 2018-09-15 06:37 GMT
కొద్దిరోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకటే హోరు.. లగడపాటి సర్వే అంటూ లెక్కలు విశ్లేషణలు.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. టీఆర్ఎస్ ఓడిపోతుందని సీట్లతో సహా లగడపాటి సర్వే చేశారని ఓ మెసేజ్ సర్య్కూలేట్ అవుతోంది. గెలిచే ఎమ్మెల్యేల సీట్లను కూడా అందులో ప్రస్తావించారు.

ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మాజీఎంపీ - కాంగ్రెస్ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ సర్వేలకు బాగా విశ్వసనీయత ఉండేది. ఆయన చేసిన సర్వేలన్నీ ఆల్ మోస్ట్ అన్నీ నిజమయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా లగడపాటి తన టీంతో సర్వే చేస్తే అక్కడ కూడా దాదాపు అంచనావేసిన సీట్లే వచ్చాయి. దీంతో లగడపాటి సర్వేలపై జనంలో నమ్మకం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ లగడపాటి సర్వే నిర్వహించారంటూ.. ఆ సర్వే ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలను పెడుతున్నారు. ఈ వార్తలు వైరల్ గా మారడంతో తాజాగా లగడపాటి రాజగోపాల్ స్పందించారు. సోషల్ మీడియాలో తన సర్వేల పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని వివరణ ఇచ్చారు. ఆ సర్వే ఫలితాలకు - తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాతే జననాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తానని వివరించారు. ఓట్లకు ముందే తాను సర్వే చేసి ఫలితాలను వెల్లడిస్తానని తెలిపారు. అంతవరకూ తన పేరిట ఏ ప్రచారం జరిగినా అవి కేవలం వేరొకరి కల్పితాలేనని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో లగడపాటి సర్వే ఉట్టి తప్పుడు వార్త అని తేలిపోయింది.
Tags:    

Similar News