సామాజిక న్యాయం డ్రామా ఆపండి: ఆ రెండు పార్టీల‌పై ల‌క్ష్మీనారాయ‌ణ ఫైర్‌

Update: 2022-07-18 06:34 GMT
భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జూలై 18న సోమ‌వారం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు, లోక్ స‌భ ఎంపీలు రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకోనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము, ప్ర‌తిప‌క్షాల కూట‌మి త‌ర‌ఫున కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అటు అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ఇటు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ రెండూ కూడా బీజేపీ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అంటే ఏపీలో ఉన్న మొత్తం ఓట్లు (ఎమ్మెల్యేలు,లోక్ స‌భ ఎంపీలు) ద్రౌప‌ది ముర్ముకే ప‌డ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జాయింట్ డైరెక్ట‌ర్, జ‌న‌సేన పార్టీ మాజీ నేత ల‌క్ష్మీనారాయ‌ణ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను ఉప‌యోగించుకుని రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే బీజేపీ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ఓటేస్తామ‌ని వైఎస్సార్సీపీ, టీడీపీ డిమాండ్ చేయాల‌ని ల‌క్ష్మీనారాయ‌ణ త‌న ట్వీట్ లో సూచించారు. ప్ర‌త్యేక హోదా సాధించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని ఆ ట్వీట్ లో ఆ రెండు పార్టీల‌కు ఆయ‌న ఉద్భోదించారు.

 “ప్రియమైన ఏపీ శాసనసభ్యులారా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ముందు మీ మనస్సాక్షిని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని ఒక‌సారి గుర్తుకు తెచ్చుకోండి. ఆత్మ‌ప‌రిశీల‌న మేర‌కు ఓటు వేయండి” అని లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఇప్పుడే కాకుండా ఇటీవ‌ల కూడా ఆయ‌న ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ప్ర‌త్యేక హోదా సాధించ‌డానికి రెండు పార్టీలు.. వైఎస్సార్సీపీ, టీడీపీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ను సావ‌కాశంగా తీసుకోవాల‌ని కోరారు.

అవిశ్వాస తీర్మానాలు, రాజీనామాలు, ఎన్డీయే నుంచి వైదొలగడం వంటివి రాజకీయ లబ్ధి కోసం చేశార‌ని ల‌క్ష్మీనారాయ‌ణ ఆ రెండు పార్టీల‌పై ల‌క్ష్మీనారాయ‌ణ త‌న ట్వీట్ లో ధ్వ‌జ‌మెత్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాతే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేయండి అని ట్వీట్ చేశారు.

2012 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో షెడ్యూల్డ్ తెగ అభ్యర్థి పీఏ సంగ్మా రేసులో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు వైఎస్సార్సీపీ, టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ అభ్య‌ర్థి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని గుర్తు చేశారు. టీడీపీ మాత్రం వ్యూహాత్మ‌క మౌనాన్ని ఆశ్ర‌యించింద‌న్నారు. అప్పుడు ఈ రెండు పార్టీల‌ సామాజిక న్యాయం ఏమైంది? అని నిల‌దీశారు.

ఇప్ప‌టికైనా రాష్ట్రపతి ఎన్నికల్లో ‘సామాజిక న్యాయం డ్రామా’ ఆడకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే ఓటు వేయాలి అని లక్ష్మీ నారాయణ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News