ఓట్ల కోసం కాళ్ళు మొక్కుతారట

Update: 2022-08-20 07:30 GMT
అవసరార్ధం ఎవరి కాళ్ళయినా పట్టుకుంటారు అనేది చాలా పాపులర్ నానుడి. అంటే అవసరం తీర్చుకునేందుకు ఎదుటివ్యక్తి ఎవరి కాళ్ళయినా పట్టుకుంటాడని చెప్పేందుకు పై నానుడిని వాడుతారు. అయితే పై నానుడిని కాస్త నెగిటివ్ అర్ధంలోనే వాడుతారు. ఇది కేవలం నానుడి మాత్రమే కాదని నిజంగానే ఆపని చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందట. శుక్రవారం గాంధీభవన్లో మునుగోడు ఉపఎన్నికపై జరిగిన కీలకమైన సమావేశంలో పై విధంగా నిర్ణయించారని సమాచారం.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నేతలంతా సమావేశమయ్యారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని అందరు తీర్మానించారు. అయితే గెలవటం ఎలాగన్నదే అసలు సమస్య. ఇందుకనే ప్రచారంలో కొత్తపంథాని అనుసరించాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ అదేమిటంటే ఓట్లేయమని ఓటర్లను అభ్యర్ధించటం, చేతులు పట్టుకుని కాళ్ళనుకోమని అనటం మామూలుగా జరిగేదే. అయితే దాన్నే ఆచరణలోకి తీసుకురావాలని సమావేశం నిర్ణయించిందట.

ప్రచారానికి వెళ్ళినపుడు ప్రతిఓటరు కాళ్ళకి దండం పెట్టి ఓట్లడగాలని ఫైనల్ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం లక్షమంది ఓటర్ల కాళ్ళను మొక్కి ఓట్లడగబోతున్నారట.

ప్రతి గ్రామానికి ఐదుగురు నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కూడా సమావేశం నిర్ణయించింది. కాళ్ళకుమొక్కి ఓట్లేడిగే ప్రచారాన్ని ముందు రేవంత్ రెడ్డే ప్రారంభించబోతున్నారట. సిట్టింగ్ స్ధానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత అవస్తలు పడుతున్నదనేందుకు ఈ నిర్ణయమే తాజా ఉదాహరణ.

ఒకవైపు బీజేపీ మరోవైపు టీఆర్ఎస్ కూడా ఉపఎన్నికపై పూర్తిస్ధాయిలో దృష్టిపెట్టాయి. 20వ తేదీన కేసీఆర్ ఆధ్యక్షతన మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోనే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మరుసటి రోజే అంటే 21వ తేదీన నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించబోతోంది.

బహిరంగసభ విషయంలో కాంగ్రెస్ ఏమిచేయబోతోందనే విషయంలో క్లారిటి లేదు. ముందు అభ్యర్ధి ఎవరనే విషయంలో క్లారిటి వస్తే తర్వాత ప్రచారం, బహిరంగ సభ విషయం తేలుతుంది. మొత్తానికి కాళ్ళకుమొక్కి ఓట్లడగటం అనేది మాత్రం వినూత్రమైన ప్రచారమనే చెప్పాలి.
Tags:    

Similar News