జగన్ అడ్డాలో చినబాబు వెలెందుకు పెట్టారు?

Update: 2016-02-27 11:54 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారు ఆయనకు సంబంధించి ఒక విషయం చెబుతుంటారు. ఏ విషయాన్ని ఆయన ఒక పట్టాన తేల్చరని.. దూకుడు నిర్ణయాలు అస్సలు తీసుకోరని.. కఠిన నిర్ణయం తీసుకోవటానికి తొందరపడరని చెబుతుంటారు. కానీ.. తాజాగా మాత్రం ఆయన తన వైఖరికి పూర్తి భిన్నమైన ధోరణిని ప్రదర్శించటం ఆసక్తికరంగా మారింది. ఏపీ విపక్ష నేత జగన్ కు ఆయన సొంత కోటలోనే దెబ్బ తీయాలన్న తొందర పెరిగింది. నిజానికి దీనికి కారణం లేకపోలేదు.

తెలంగాణలో పార్టీకి తగులుతున్న దెబ్బలకు.. ప్రతిగా తాను అధికారంలో ఉన్న ఏపీలో తన సత్తా ప్రదర్శించాలన్న తపన బాబులో పెరిగింది. అదే సమయంలో తన వారసుడి సత్తా అందరికి చాటాల్సిన అవసరం ఆయనకు అనివార్యమైంది. ఓపక్క తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్.. తన సత్తా ఏమిటన్నది గ్రేటర్ ఎన్నికల్లో అందరికి అర్థమయ్యేలా చేశారు. అదే సమయంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్.. తన సత్తా చాటాలని విపరీతంగా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు సరికదా ఎదురుదెబ్బలు తప్పలేదు.

దీంతో.. అర్జెంట్ గా తనను తాను ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లోకేశ్ మీద పడింది. కొడుకు పొలిటికల్ కెరీర్ కోసం పక్కా గేమ్ ప్లాన్ సెట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు అనివార్యమైంది. ఇలా మొదలైన మధనం జగన్ కోట మీద బాబు దృష్టి పడింది. జగన్ అడ్డా అయిన కడపను ఢీ కొట్టి..  అక్కడ ఆయన పార్టీని ముక్కలుచెక్కలు చేయాలని డిసైడ్ అయ్యారు.

దీనికి కారణం లేకపోలేదు. వైఎస్ తాతల నుంచి కడప కోటను బద్ధలు కొట్టటం అంత ఈజీ కాదు. అలాంటి క్లిష్టమైన లక్ష్యాన్ని చేధించగలిగితే.. లోకేశ్ సత్తా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగటమే కాదు.. చంద్రబాబు బలం అమితంగా పెరిగే వీలుంది. అందుకే.. కడప జిల్లాకు చెందిన జగన్ బ్యాచ్ నేతల్ని సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కడప జిల్లాలో జగన్ దెబ్బ తీయటం ద్వారా వచ్చే క్రెడిట్ మొత్తాన్ని కొడుకు ఖాతాలో జమ చేయటం ద్వారా లోకేశ్ సామాన్యుడు కాదండోయ్ అన్న మాట అందరి నోట అనిపించేలా చేయాలన్నది చంద్రబాబు ప్లాన్ గా చెబుతున్నారు.

ప్రజాకర్షణ విషయంలో పెద్దగా మార్కులు పడని చినబాబుకు.. ఆపరేషన్ కడప లో డిస్టింక్షన్ వచ్చేలా చేసి.. మంత్రాంగం నడపటంలో లోకేశ్ మొనగాడన్న మాట ప్రచారంలోకి వచ్చేలా చేయాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే రెండు రోజులు కడప జిల్లాలో సిట్టింగ్ వేసిన లోకేశ్.. తన పని మొదలు పెట్టారు. ఓపక్క కడప జిల్లాకు చెందిన జగన్ పార్టీ నేతల్ని సైకిల్ ఎక్కించేందుకు బెజవాడ నుంచి చంద్రబాబు చక్రం తిప్పుతుంటే.. దానికి పూర్తి భిన్నమైన వ్యూహాన్ని లోకేశ్ అమలు చేయటం షురూ చేశారు.

జిల్లాలోని నియోజకవర్గాల వారీగా తెలుగు తమ్ముళ్లతో భేటీలు పెట్టుకున్న లోకేశ్.. స్థానిక నాయకత్వాల్ని కలుస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించటం.. వారికి మంచి భవిష్యత్తు ఉందంటూ ఉత్సాహపర్చటం కనిపిస్తుంది. తాను కలిసే నేతలతో కడప జిల్లాలలో సైకిల్ జోరు పెరగటానికి తాము చేస్తున్న ప్రయత్నాల్ని లోగుట్టుగా వివరిస్తూ.. జగన్ ను దెబ్బ తీసే ఛాన్స్ తమకిప్పుడు వచ్చిందని.. కాకపోతే తమ్ముళ్లు కాస్త కోఆపరేట్ చేయాలని.. ప్రత్యర్థి పార్టీ వారు సైకిల్ ఎక్కటాన్ని స్వాగతించాలని.. వారితో కలిసిపోవాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.

 పార్టీలో మొదటి నుంచి ఉన్న వారి సంగతి తమకు విడిచి పెట్టాలని.. వారి భవిష్యత్తును తాము చూస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తున్న వారి విషయంలో అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోకుండా సర్దుకుపోవాలని.. జగన్ ను ఒక్కసారి దెబ్బ తీస్తే.. ప్రత్యర్థి అనేవాళ్లే ఉండరని.. ఇది రాజకీయంగా పార్టీకి లాభిస్తుందని.. ఆ ఫలాలు తమ్ముళ్లకు తప్పక లభిస్తాయన్న భరోసా ఇస్తున్నారు. ఓటమి ఒక అలవాటుగా మారిన తమ్ముళ్లకు వైఎస్ ఫ్యామిలీ మీద గెలుపు ఇచ్చే కిక్ కోసం చినబాబు మాటను ఓకే అంటున్నట్లు తెలుస్తోంది.

ఇదే.. దశాబ్దాలుగా సాగుతున్న వైరాన్నిసైతం వదిలేందుకు తమ్ముళ్లు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇది కాస్త ఇబ్బందే అయినప్పటికి.. జగన్ పార్టీని దెబ్బ తీస్తున్నామన్న సంతోషం వారి చేత చినబాబు మాటకు ఓకే అనేలా చేస్తోంది. ఇప్పటికే ప్లాన్ సెట్ చేసి.. అందుకు తగ్గట్లే గ్రౌండ్ ప్రిపేర్ అయిన నేపథ్యంలో క్లైమాక్స్ మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. అంతిమంగా జిల్లాలోని మరికొందరు జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని సైకిల్ మీద ఎక్కించటం ద్వారా ఏపీ విపక్ష నేత అయువు పట్టు మీద కొట్టి.. తమ పని పూర్తి చేయాలన్నదే బాబు బ్యాచ్ గేమ్ ప్లాన్ గా చెబుతున్నారు. ఈ ప్లాన్ లో దాదాపుగా మూడు వంతుల పని పూర్తి అయ్యిందని.. క్లైమాక్స్ మాత్రమే మిగిలిందని చెప్పొచ్చు. మరి.. బాబు అనుకున్నట్లే కడప క్లైమాక్స్ ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.
Tags:    

Similar News