వైశ్యుల్ని ఏమ‌న్నా అంటే కాళ్ల విర‌గొట్టమ‌న్న ఎంపీ

Update: 2017-10-06 12:35 GMT
ఐల‌య్య వ‌ర్సెస్ ఆర్య‌వైశ్యుల మ‌ధ్య వివాదం అంత‌కంత‌కూ ముదురుతూనే ఉంది. దేవుడిచ్చిన తెలివిని న‌లుగురిని కించ‌ప‌రిచేలా అక్ష‌రాల్ని వాడుకోవ‌టంలో ఉన్న ఆనందం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాని ప‌రిస్థితి. సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అంటూ  పుస్త‌కం టైటిల్‌తోనే తిట్ట‌టం షురూ చేసిన ఆయ‌న‌.. పుస్త‌కంలోని ఒక్కో పేజీ తిప్పే కొద్దీ క‌డుపు మండిపోవ‌టం ఖాయం.

కోమ‌టోళ్ల ఆహార అల‌వాట్లు మొద‌లుకొని వారి ఇళ్ల‌ల్లో ఎలా ఉంటార‌న్న విష‌యాన్ని.. వారి ఇంటి కిటికీల్లో  నుంచి తొంగి చూసి రాసిన‌ట్లుగా రాయ‌టం విచిత్ర‌మైన అంశం. ల‌క్ష‌లాదిగా ఉన్న త‌మ వారి మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచేలా పుస్త‌కం ఎలా రాస్తారంటూ ఆర్య‌వైశ్యులంతా అడుగుతున్నా.. ఆయ‌న నుంచి స‌మాధానం రాని ప‌రిస్థితి.

పుస్త‌కాన్ని వెన‌క్కి తీసుకొమ్మ‌ని ఆర్య‌వైశ్యులు అడుగుతున్న కొద్దీ.. మ‌రింత‌గా చెల‌రేగిపోతున్న ఐల‌య్య తీరుతో ఈ వివాదం వారాల త‌ర‌బ‌డి సాగుతూనే ఉంది. త‌మ‌ను తీవ్రంగా అవ‌మానించిన ఐల‌య్య‌తో తాడోపేడో తేల్చుకోవాల‌న్న‌ట్లుగా వైశ్యులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎంత‌కూ నిర‌స‌నల జోరు త‌గ్గ‌కుండా రోజుకో తీరులో ఆందోళ‌న‌ల్ని నిర్వ‌హిస్తున్నారు వైశ్యులు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది.

తాజాగా గోదావ‌రి జిల్లాల్లోని కామ‌వ‌ర‌పు కోట ఆర్య‌వైశ్య క‌ళ్యాణ‌మండ‌పం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఈ రోజు (శుక్ర‌వారం) జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ ఎంపీ మాగంటి బాబు.. టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆర్య‌వైశ్యుల్ని ఉద్దేశించి మాట్లాడిన మాగంటి బాబు.. ఆర్య‌వైశ్యులు స్మ‌గ్ల‌ర్లు కాద‌న్నారు. ఆర్య‌వైశ్యుల్ని ఏమైనా అంటే కాళ్లు విర‌గొట్టాల‌ని.. వారి వెనుక తాను ఉన్నానంటూ వ్యాఖ్యానించారు మాగంటి బాబు.

ఇక‌.. టీజీ వెంక‌టేశ్ మాట్లాడుతూ.. ఆర్య‌వైశ్యులు స్మ‌గ్ల‌ర్లు ఎంత‌మాత్రం కాద‌ని.. వివాదాస్ప‌ద పుస్త‌కాన్ని రాసి ప‌దిరెట్లు ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకున్న మీరే స్మ‌గ్ల‌ర్లు అని మండిప‌డ్డారు. ఆర్య‌వైశ్యుల్ని కించ‌ప‌రిచేలా పుస్తకం రాసిన కంచె ఐల‌య్య క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. చూస్తుంటే.. ఐల‌య్య‌ను ఆర్య‌వైశ్యులు ఒక ప‌ట్టాన వ‌దిలేట‌ట్లుగా లేరే!
Tags:    

Similar News