స్నేహితుడ్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా చేసుకున్నాడుగా!

Update: 2019-06-08 11:33 GMT
ఊహించ‌ని రీతిలో షాకులు ఇవ్వటం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఎంత బాగా తెలుస‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఆయ‌న ఒక‌సారి ఫిక్స్ అయితే దాని అంతు చూసే వ‌ర‌కూ వ‌దిలిపెట్టరు. అంతేనా?  ప్ర‌త్య‌ర్థిని ఒక ప‌ట్టాన వ‌ద‌ల‌ని ఆయ‌న‌.. వారి ఉనికి సైతం ప్ర‌శ్నార్థ‌కం అయ్యేలా చేస్తార‌న్న‌ది తెలిసిందే. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లు పార్టీల‌ను సోదిలో లేకుండా చేసిన కేసీఆర్‌.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఉనికిని ప్ర‌శ్నార్థ‌కం చేసే ప‌నిలో తెగ బిజీగా ఉండ‌టం తెలిసిందే.

ఇప్ప‌టికే డ‌జ‌ను మంది ఎమ్మెల్యేల్ని టీఆర్ ఎస్ లో చేర్చ‌టం ద్వారా.. అసెంబ్లీలో ఆ పార్టీ బ‌లం ఆరుకు ప‌రిమిత‌మ‌య్యేలా చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మిత్రుడ్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా మార్చుకున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని సిత్ర‌మైన దృశ్యం తెలంగాణ‌లో చోటు చేసుకుంటుంద‌ని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ది ఎవ‌రో తెలుసా?  అధికార‌ప‌క్షానికి అత్యంత ఆఫ్తుడైన మ‌జ్లిస్ పార్టీనే. త‌న‌కు ఆపత్ కాలంలో అండ‌గా ఉండే మ‌జ్లిస్ ఈ రోజున తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం. ఇదొక్క‌టి చాలు.. తెలంగాణ‌లో ప్ర‌శ్నించే గొంతుల ప‌రిస్థితి ఎలా మారిందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమంటే.. త‌న ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోయేలా చేసిన సీఎం కేసీఆర్ పుణ్య‌మా అని కేబినెట్ హోదా ఉన్న ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నాయ‌కుడి ప‌ద‌విని త‌న మిత్రుడైన మ‌జ్లిస్ పార్టీకి క‌ట్ట‌బెడుతున్నారు.

ప్ర‌త్య‌ర్థి ఉనికి ప్ర‌శ్నార్థ‌కం అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. వారికి ఉండాల్సిన క‌నీస ప‌ద‌వి లేకుండా చేయ‌టం చూస్తే.. రాజ‌కీయంగా త‌న‌ను విభేదించే వారి విష‌యంలో కేసీఆర్ ఎంత క‌ఠినంగా ఉంటార‌న్న‌ది ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.
Tags:    

Similar News