విన‌య విధేయ అనిల్ : జ‌గ‌న్ ఆదేశాలు భ‌లే ప‌నిచేశాయే !

Update: 2022-04-18 02:30 GMT
ఆయ‌న పోల‌వ‌రం గురించి మాత్ర‌మే మాట్లాడ‌రు. మిగతావ‌న్నీ మాట్లాడ‌తారు.ఆయ‌న కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి గురించి మాత్ర‌మే మాట్లాడ‌రు. మిగ‌తా నాయ‌కుల అంద‌రి గురించీ మాట్లాడ‌తారు. దివంగ‌త గౌత‌మ్ రెడ్డికి  నివాళి ఇస్తూ మాట‌లకు మాత్రం ముగింపు ఇస్తారు. ఇదీ ఇవాళ న‌డుస్తున్న రాజ‌కీయం. నెల్లూరు కేంద్రంగా న‌డుస్తున్న రాజ‌కీయాలకు సంకేత రూపం. స్వాభావికంగా విరుచుకు ప‌డే నైజం ఉన్న అనిల్ ఈ రోజు మాత్రం అసాధార‌ణ సంయ‌మ‌నం పాటించి ఎప్ప‌టిలానే విప‌క్షాల‌కూ, విరోధులకూ నేరుగా కాకుండా ప‌రోక్ష రీతిలోనే స్ప‌ష్టం అయిన సంకేతాలు ఇచ్చారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

ప‌ద‌వులు లేని వారంతా ఏమౌతారు అన్న డౌట్ ఉంది. ప‌ద‌వులు లేని వారంతా ఇక‌పై అస్స‌లు మాట్లాడ‌రు అని డౌట్ కూడా ఉంది కానీ తాను మాత్రం ఆ తాను ముక్క‌ను కాను అని స్ప‌ష్టం చేసేందుకు  నెల్లూరు నేత మ‌రియు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స్ప‌ష్ట‌మ‌యిన సంకేతాలు ఇచ్చే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.ఈ క్ర‌మంలో ఆయ‌న ఆచితూచి మాట్లాడారు. తూకం త‌ప్ప‌కుండా, త‌ప్పుకు  దొర‌క్కుండా, అర్థం చెడ‌కుండా, అధిష్టానంతో స్నేహం మ‌రియు స‌ఖ్య‌త అన్న‌వి చెడ‌కుండా ఉండేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు ప‌డ్డారు. లేదా తీసుకున్నారు అని రాయాలి.

ముఖ్యంగా కాక‌లు తీరిన యోధులున్న నెల్లూరు జిల్లాలో అంద‌రినీ థాంక్స్ చెబుతూ చెబుతూ ఆఖ‌రికి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ప‌డ‌ని, పొడ‌గిట్ట‌ని కోటం రెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి (నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే) పేరు కూడా చెబుతూ.. కాకాని గోవ‌ర్థ‌న్ పేరు ప్ర‌స్తావ‌న మాత్రం మ‌రిచిపోయారు. కానీ కాకాని మాత్రం ఇదే రోజు జిల్లాకు వ‌చ్చారు. మంత్రిగా ప్ర‌మాణం చేశాక తొలిసారి జిల్లాకు వ‌చ్చారు. కావ‌లిలో బ్ర‌హ్మండం అయిన ఆతిథ్యం మ‌రియు స్వాగ‌త స‌త్కారం అందుకున్నారు.

ఆ సంద‌ర్భంగా అనిల్ స‌భ‌ను తన‌కు పోటీగా ఏర్పాటు చేసిన స‌భ అని అనుకోవ‌డం లేద‌ని తేల్చేయ‌డం విశేషం. అంటే వీరిద్ద‌రి మాట‌లు వెనుకా అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు మ‌రియు హెచ్చ‌రిక‌లు బాగానే ప‌నిచేశాయన్న‌ది ఓ నిర్థార‌ణ. అదే వాస్త‌వం కూడా !

ఈ నేప‌థ్యాన ఇవాళ నెల్లూరు గాంధీ బొమ్మ  సెంట‌రులో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ ఎక్క‌డా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఆ విధంగా విన‌య విధేయ అనిల్ అని అనిపించుకున్నారు. మంత్రి ప‌ద‌వి పోగానే తాను ఇక ఇంటికే పరిమితం అవుతాన‌ని విప‌క్ష పార్టీలు క‌ల‌లు క‌న్న విధంగా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని, ఇక‌పై కూడా జ‌ర‌గ‌ద‌ని కూడా చెప్పారాయ‌న.

అంతేకాదు ఆ మూడు మీడియాల‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు చెబుతూ మాట‌లు ముగించారు. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి, టీవీ ఫైవ్, మ‌హా న్యూస్ ఏది ప‌డితే అది రాయొద్ద‌ని స‌భా ముఖంగా విన్న‌వించుకుంటున్నాన‌ని,ఈ ఒక్క‌రోజు తానేం చెప్పానో అదే రాయాల‌ని, చెప్పాల‌ని అన్నారు. ఎలానూ రేప‌టి నుంచి మీ ప‌లుకులు మీకు ఉంటాయి క‌దా వాటిని ప‌ల‌కండి కానీ ఈ ఒక్క రోజు ఆ త‌ర‌హా వార్త‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వండి  అని విజ్ఞ‌ప్తి చేశారు.
Tags:    

Similar News