'ప్రజలు అర్ధం చేసుకోవాలి'... ఆర్థిక పరిస్థితిని సవివరంగా వివరించిన బాబు!

అవును... ఏపీలో కూటమి పార్టీలు హామీలు ఇచ్చిన మాట వాస్తవమే కానీ.. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ తాము అనుకున్నదానికంటే, తాము ఊహించినదానికంటే ఘోరంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.;

Update: 2025-01-27 21:30 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే పెన్షన్స్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు మరికొన్ని హామీలను అమలుచేశారు. 'తల్లికి వందనం' వంటి వాటిని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు.

ఇదే సమయంలో... అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, మద్యం, ఇసుక, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ లాంటి కొత్త విధానాలు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... వీటన్నింటితో పాటు రూ.8,258 కోట్ల మేర బిల్లులు క్లియర్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు.

అవును... ఏపీలో కూటమి పార్టీలు హామీలు ఇచ్చిన మాట వాస్తవమే కానీ.. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ తాము అనుకున్నదానికంటే, తాము ఊహించినదానికంటే ఘోరంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమయంలో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరిన బాబు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతోపాటు మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు.

ఈ సమయంలో ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అలా అని అప్పులు చేసినా.. తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదని.. ఈ పరిస్థితి వైసీపీ ప్రభుత్వం చేసిన పనులే కారణం అని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని.. అర్ధం చేసుకోవాలని అప్పీల్ చేశారు.

ఈ సందర్భంగా... 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ పై స్పందించిన చంద్రబాబు... ఆ ఆర్థిక సంవత్సరంలో గత ప్రభుత్వం రూ.67 వేల కోట్లు అప్పులు తెచ్చారని.. అయితే వాటిని అభివృద్ధి పనులకు వినియోగించలేదని.. వచ్చిన డబ్బులను వైసీపీ సర్కార్ దుబారా ఖర్చులు చేసింది.

ఇదే సమయంలో.. రాష్ట్ర ఆదాయం కూడా 17.1 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిపోయిందని.. అదేవిధంగా అప్పులు 16.5 శాతం మేర పెరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.7,244 కోట్ల మూలధన వ్యయం చేయగా.. ఒక్క జలవనరు ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు.

ఏది ఏమైనా.. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల్లో భాగంగా 15శాతం వృద్ధి రేటు కోసం ప్రణాళికలు వేస్తున్నామని తద్వారా అప్పటికి తలసరి ఆదాయం రూ.58,14,916 కు చేరుతుందని బాబు స్పష్టం చేశారు. మరోపక్క ఇప్పటి వరకూ రూ.6,33,568 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని.. ఫలితంగా 4.10 లక్షల ఉద్యోగాలు వస్తాయని బాబు తెలిపారు.

Tags:    

Similar News