ఆ దేశ పార్లమెంట్ లో పొగ బాంబులు విసిరిన ప్రతిపక్షం
వీధి పోరాటానికి మించిన దారుణ పరిస్థితులు సెర్బియా పార్లమెంట్ లో చోటు చేసుకున్నాయి.;
వీధి పోరాటానికి మించిన దారుణ పరిస్థితులు సెర్బియా పార్లమెంట్ లో చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యులు అధికార సభ్యుల మీద స్మోక్ బాంబులు విసరటం షాకింగ్ గా మారింది. అదే సమయంలో.. ఈ స్మోక్ బాంబులు తగిలిన సభ్యుల్లో ముగ్గురు ఎంపీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయించే అంశంపై జరగాల్సిన ఓటింగ్ ను ప్రతిపక్షాలు బలంగా వ్యతిరేకించాయి.
ఈ క్రమంలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సమావేశం అక్రమమని.. ప్రధానమంత్రి మిలోస్ వుసెవిక్.. ఆయన ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్ష సభ్యులు సభలో ఏకంగా స్మోక్ బాంబులు విసరటం సంచలనంగా మారింది. సమావేవం మొదలైన అరగంటలోనే ప్రతిపక్ష సభ్యులు.. ఈలలు.. కేకలతో పార్లమెంట్ హౌస్ దద్దరిల్లింది.
అధికార.. విపక్ష సభ్యుల మధ్య మొదలైన వాగ్వాదం తర్వాత ముష్ఠిఘాతాలు కురిపించుకున్నారు. ఆపై కోడిగుడ్లు.. స్మోక్ బాంబులు.. వాటర్ బాటిళ్లు విసిరేసుకోవటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు బయటకు వచ్చాయి. ప్రతిపక్షం ఉగ్రవాద ముఠాగా మారిందని స్పీకర్ అనా బిర్నాబిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోపల అసాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనే వెలుపల ప్రతిపక్ష మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు దేశంలో రాజకీయ సంక్షోబానికి దారి తీయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత ఏడాది నవంబరులో కాంక్రీట్ నిర్మాణం కూలి 15 మంది చనిపోయారు. మరికొన్ని ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలన్నింటిని పేర్కొంటూ దేశంలో అవినీతి పెరిగిందన్న ఆగ్రహం విద్యార్థుల్లో ఎక్కువ అవుతోంది. వీరంతా భారీ నిరసనలు చేస్తున్నారు. విద్యారంగానికి ఎక్కువ నిధులు.. ఇతర డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని వుసెవిక్ జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే ప్రధాని రాజీనామా అమల్లోకి వస్తుంది. ఇలాంటి వేళలో.. ఈ అసాధారణ ఘటన చోటు చేసుకుంది.