మనవరాలి 'చీట్'చాట్.. అమ్మమ్మ ఖాతాలో 80 లక్షలు ఖాళీ
ఇక పిల్లల చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆన్ లైన్ ఆటలు ఆడుతుంటే లింక్ లు పంపి.. పెద్దవారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.;
ఇప్పుడంతా ఆన్ లైన్ నేరగాళ్ల రాజ్యం నడుస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా వీరి వార్తలే.. ఉద్యోగం అనో.. వ్యాపారమనో.. పెట్టుబడి అనో.. ఏదో ఒక రూపంలో ఆన్ లైన్ నేరగాళ్లు ప్రజల ఖాతాల్లోకి చొరబడి డబ్బు కాజేస్తున్నారు.
ఇక పిల్లల చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆన్ లైన్ ఆటలు ఆడుతుంటే లింక్ లు పంపి.. పెద్దవారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలానే ఓ మనవరాలి చిట్‌చాట్.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు ఖాళీ చేసేలా చేసింది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఢిల్లీ శివారు గురుగ్రామ్ కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాటల మధ్యలో తాము భూమిని అమ్మగా రూ.80 లక్షలు వచ్చాయని.. ఆ డబ్బు అమ్మమ్మ ఖాతాలో ఉందని స్నేహితురాలికి చెప్పింది. దీన్ని పదో తరగతి విద్యార్థి విని డబ్బును కాజేసే ఆలోచనకు వచ్చాడు. దుర్బుద్ధి కొద్దీ ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పాడు. వీరు మరికొందరితో కలిసి వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బును కాజేయాలని ప్రణాళిక వేశారు.
అనుకున్న విధంగా సుమిత్ కటారియా అనే యువకుడు అన్ లైన్ లో బాలికతో పరిచయం పెంచుకొని ఫొటోలు సేకరించాడు. వాటిని మార్ఫింగ్ చేసి.. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. దీంతో తన అమ్మమ్మకు తెలియకుండా విద్యార్థిని పలు దఫాలుగా వారి అకౌంట్లకు నగదు పంపింది. డబ్బులన్నీ అయిపోయినా బెదిరింపులు కొనసాగిస్తుండడంతో బాలిక తమ టీచర్ కు విషయం చెప్పింది. ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రంగంలోకి దిగారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
దీన్నిబట్టి చెప్పేదేమంటే.. పిల్లలకు ఆర్థిక విషయాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి.. రెండో పాయింట్ ఏంటంటే.. పిల్లలకు బయటివారితో ఎలా మెలగాలో తెలియజేయాలి. ఆన్ లైన్ లో పరిచయమైన గుర్తుతెలియనివారికి ఫొటోలు పంపడం వంటివి అసలు చేయకూడదు.
ఆన్ లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు చేస్తున్న సూచనలను పాటించాలి.