మోడీ డీలిమిటేషన్ ని ఢీ కొట్టిన స్టాలిన్ !

ఇలా చేయడం వల్ల ఇబ్బందులే వస్తాయని మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అంటున్నారు.;

Update: 2025-03-06 00:30 GMT

కేంద్రంలోని నరేంద్ర మోడీ డీలిమిటేషన్ ని అమలు చేయాలని చూస్తోంది. దానికి 2011 జనాభా లెక్కలను తీసుకుని వాటిని 2025కి అనువదించి ఆ విధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా ఎంపీ సీట్లను పెంచాలని చూస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇలా చేయడం వల్ల ఇబ్బందులే వస్తాయని మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అంటున్నారు.

ఈ విషయంలో డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే మొదటి నుంచి కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. కొత్త జనాభా లెక్కలను తీసుకుని ఈ ప్రక్రియను అమలు చేస్తే కనుక కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయని అంటున్నారు. ఉత్తరాదిన పెరిగిన జనాభాతో ఎంపీ సీట్లు ఎక్కువగా ఉంటాయని అదే సౌత్ ఇండియాలో ఐదు ముఖ్యమైన రాష్ట్రాలకు పెద్దగా పెరిగేదీ ఒరిగేదీ ఏదీ ఉండదని అంటున్నారు.

ఈ నేపధ్యంలో స్టాలిన్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలనే తీసుకున్నారు. దాని ప్రకారం చూస్తే కనుక 1971 జనాభా లెక్కలనే ఆధారంగా తీసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. అలాగే ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లనే మరో ముప్పయ్యేళ్ళ పాటు కొనసాగించాలని కూడా తీర్మానించారు.

డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ఆధారంగా చేయరాదని కోరారు. అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలే తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యాభై ఏళ్ళ పాటు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసి దేశ వికాసానికి అభివృద్ధికి పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ పేరుతో సీట్లు తగ్గించి శిక్ష విధిస్తారా అని స్టాలిన్ ప్రశ్నిస్తున్నారు.

అదే విధంగా చూస్తే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవని ప్రధాని నరేంద్ర మోడీ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేస్తోంది. ఇక డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ప్రజా భాగస్వామ్యంతో ఆందోళనను చేపట్టడానికి కూడా అఖిలపక్షం నిర్ణయించింది.

అలాగే దక్షిణాదికి చెందిన ఎంపీలతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి కేంద్రం తీసుకుంటున్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించింది. ఈ విషయంలో దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాలను కలుపుకుని పోతామని స్టాలిన్ అంటున్నారు.

అయితే సౌత్ లో ఉన్న అయిదు రాష్ట్రాలలో నాలుగు ఇండియా కూటమిలో ఉన్నవే. ఒక్క ఏపీ మాత్రమే ఎన్డీయేలో ఉంది. మరి ఏపీని ఈ విషయంలో కలుపుకుని పోతారా లేదా అన్నది చూడాలి అదే సమయంలో డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా సౌత్ నుంచి నాయకత్వం వహిస్తూ మోడీతో ఢీ కొట్టేందుక్ స్టాలిన్ రెడీ కావడం కొత్త రాజకీయ పరిణామంగానే చూస్తున్నారు. రానున్న రోజులలో ఇది ఏ రకమైన మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News