రెండు ఎన్నికలు: వైసీపీ నేర్వాల్సిన పాఠం.. ఇదేనా..!
రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ కూటమి నాయకులు ఘన విజయం దక్కించుకున్నారు.;
రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ కూటమి నాయకులు ఘన విజయం దక్కించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నియోజకవ ర్గంలో కూటమి తరఫున బరిలో నిలిచిన నాయకులు విజయం సాధించారు. అది కూడా.. ఇద్దరూ లక్ష ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. వైసీపీ చెబుతున్నట్టు ప్రజల్లో వ్యతిరేకత ఉండి ఉంటే.. ఇది సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న.
ఈ విజయం సహజంగానే.. కూటమి పార్టీల్లో జోష్ పెంచింది. అయితే.. ఇదేసయమంలో వైసీపీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం ఏర్పడి.. 9 మాసాలు కూడా కాకుండానే ఏదో జరిగి పోయిందని.. ప్రజలంతా ఏవగించుకుంటున్నారని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవహారం తేలిపోయింది. ప్రజల్లో వైసీపీ అనుకుంటున్నట్టుగా అంత వ్యతిరేకత ఏమీ లేదని స్పష్టమైంది. అంతేకాదు.. కూటమి వెంటే తాము ఉన్నామన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టు అయింది.
కాబట్టి.. వైసీపీ నేతలు.. నింగిలో మబ్బులు చూసి నీళ్లు ఒలకబోసుకున్న చందంగా రాజకీయాలు చేస్తే.. మున్ముందు వారికే ప్రమాదం. ఇప్పటికైనా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకునేందుకు నాయకులు ముందుకు రావాలి. ముందుగా ప్రజల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పారద్రోలి.. వైసీపీ అంటే ఏంటో చూపించాల్సి ఉంటుంది. అలా కాకుండా.. పార్టీని కేవలం తాడేపల్లి హౌస్‌కే పరిమితం చేస్తే.. మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవు.
వాస్తవానికి రెండు ఎన్నికలే కదా? అని లైట్ తీసుకుంటే.. వైసీపీ తప్పులో కాలేసినట్టే అవుతుంది. మొత్తంగా నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన ఎన్నికలు కావడంతో.. బలమైన టీడీపీ వాదన ఎలా ఉందో కూటమికి ఇక్కడి ప్రజలు లక్షల సంఖ్యలో ఎలా పట్టం కడుతున్నారో.. వైసీపీ తెలుసుకుని.. దానికి అనుగుణంగా తమ ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేకుండా.. పరిస్థితి యథాతథంగా అలానే ఉండి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.