ఏపీలో లోకేశ్ మార్క్ పాలన.. 200 చేరుకున్న వాట్సాప్ గవర్నెన్స్

ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ మరో ముందడుగు వేసింది.;

Update: 2025-03-06 10:31 GMT

ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ మరో ముందడుగు వేసింది. మన మిత్ర పేరుతో జనవరి నెలాఖరులో 161 పౌర సేవలతో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికోసం ఏపీ ప్రభుత్వం 9552300009 నెంబరును అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ డిజిటల్ గవర్నెన్స్ కు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండటంతో ప్రభుత్వం మరిన్ని పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 200 చేరుకున్నాయి.

161 రకాల సేవలతో ప్రారంభమై కేవలం నెల రోజుల వ్యవధిలోనే 200 రకాల పౌర సేవలు అందించేలా వాట్సాప్ గవర్నెన్స్ ను తీర్చిదిద్దడంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో స్పందించారు. ఇది ఎంతో విశేషమైనదిగా అభివర్ణించిన ఆయన పౌర సేవలను సమర్థవంతంగా వేగంగా అందించేందుకు మన మిత్ర స్కీం ఉపయోగపడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. విద్యా, ఐటీ మంత్రిగా ఉన్న లోకేశ్ చొరవతోనే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా, పాదయాత్ర చేసిన లోకేశ్ విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యను తెలుసుకుని చలించిపోయారు. ప్రతిసారి సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు తిరగడం తమకు భారం అవుతోందని విద్యార్థులు చెప్పగా, తాము అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితి లేకుండా చేస్తానని అప్పట్లో విద్యార్థులకు హామీ ఇచ్చారు లోకేశ్. దీంతో 2024 జూన్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే వాట్సాప్ లో డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేయాలని భావించారు. అక్టోబరులో వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం చేసుకుని రికార్డు సమయంలోనే వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చారు.

జనవరిలో మొదలైన ఈ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా 500 రకాల సేవలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత 161 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చిన సర్కారు క్రమంగా ఆ సేవలను విస్తరిస్తోంది. కేవలం 30 రోజుల వ్యవధిలో మరో 39 రకాల సేవలను అదనంగా చేర్చి 200 రకాల సేవలను డిజిటల్ రూపంలో అందజేస్తోంది. ఇంటర్, పదో తరగతి హాల్ టికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, దేవాలయ దర్శనం టికెట్లు, ఆర్టీసీ ప్రయాణ టికెట్లు మొదలైన సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వ్యవప్రయాసలు తగ్గాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News