వలంటీర్లపై క్లారిటీ.. అసెంబ్లీలో మంత్రి ప్రకటన!
ఈ నేపథ్యంలో వలంటీర్లపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి డోల బాలవీరాంజనేయులు క్లారిటీ ఇచ్చారు.;
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఎప్పుడు తమను విధుల్లోకి తీసుకుంటుందని వలంటీర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వలంటీర్లపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి డోల బాలవీరాంజనేయులు క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ ప్రతినిధులుగా వలంటీర్ల సేవలను వినియోగించుకునేవారు. పింఛన్ల పంపిణీ నుంచి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి అర్హుల ఎంపిక, పంపిణీ వంటి విషయాల్లో వలంటీర్లే కీలకంగా పనిచేసేవారు. ఇక రాజకీయంగా వారిని ఉపయోగించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. వలంటీర్లను ఉపయోగించుకుని గతంలో నిర్వహించిన స్థానిక ఎన్నికలను వైసీపీ ఏకపక్షం చేసుకుందనే ప్రచారం ఉంది.
దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ వలంటీర్ల సేవలను వాడొద్దని కూటమి ఎన్నికల కమిషనుకు ఫిర్యాదులు చేసింది. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వేతనాలను రూ.10 వేలు చేస్తామని ప్రకటించారు. ఇక వైసీపీ కూడా ఎన్నికల ముందు వలంటీర్ల సేవలు అవసరమనే ఆలోచనతో వారితో రాజీనామాలు చేయించింది.
అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వలంటీర్లపై అసలు విషయం తెలిసింది. 2023 ఆగస్టులోనే వలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, ఆ తర్వాత రెన్యువల్ చేయలేదని గుర్తించింది. ఈ విషయాన్నే చెప్పి వలంటీర్లకు ఇచ్చిన హామీపై చేతులెత్తేసింది. అమలులో లేని వలంటీర్లకు వేతనాలు, జీతాలు ఎలా ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వలంటీర్ల వ్యవస్థ ముగిసిన అధ్యాయమంటూ తేల్చేశారు. అయితే వైసీపీ మాత్రం ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తోంది.
మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ వలంటీర్లను కొనసాగించేలా జీవో ఇచ్చి రూ.10 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం వైసీపీ వాదనను తోసిపుచ్చుతోంది. వలంటీర్లు ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేయడం లేదని స్పష్టం చేస్తోంది. దీంతో ప్రభుత్వం వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం వలంటీర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులతో ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తోంది.