బాబు దగ్గుబాటి పరిణతి...రాజకీయాలకు ఒక స్పూర్తి !

కానీ రాజకీయాలకు నిర్వచనం మారుతున్న వేళ శతృవుల కంటే భీకరంగా పోట్లాడుతున్నారు.;

Update: 2025-03-06 13:03 GMT

రాజకీయాలు అంటే ప్రజాసేవ. అందులో ఒకరితో ఒకరు పోటీ పడాలి. ఆ విధంగా చూస్తే ప్రత్యర్ధులు అవుతారు కానీ శత్రువులు కాలేరు. కానీ రాజకీయాలకు నిర్వచనం మారుతున్న వేళ శతృవుల కంటే భీకరంగా పోట్లాడుతున్నారు. రాజకీయం బయట నుంచి ఇంట్లోకి ఒంట్లోకి వచ్చి రక్త సంబంధాన్నే ప్రశ్నిస్తోంది.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయంగా దశాబ్దాలుగా విభేదించుకున్న ఇద్దరు నేతలు ఒక చోట కలసి తమ వివాదాలకు విభేదాలకు నేటితో స్వస్తి అని చెప్పడం అంటే అంతకంటే సుహృద్భావ వాతావరణం వేరేగా ఉండదని అంటున్నారు. అంతే కాదు రాజకీయాలు ఎంతలా ఉన్నా అవి మనుషులను మనసులను తాకరాదని వాటి కంటే బంధాలు ఎంతో గొప్పవని చాటారు.

ఆ ఇద్దరే ముఖ్యమంత్రి చంద్రబాబు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈ ఇద్దరూ తెలుగుదేశంలో కీలకమైన పాత్ర పోషించారు. దగ్గుబాటి బాబు టీడీపీలో ఎన్టీఆర్ తోనే ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరచుకున్నారు. తెలుగుదేశం విజయాలలో ముఖ్య భూమిక పోషించారు.

ఇక చూస్తే కనుక 1984లో టీడీపీలో అతి పెద్ద రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నాదెండ్ల పార్టీని చీల్చి ఎన్టీఆర్ ని గద్దె దించితే తోడళ్ళుళ్ళు ఇద్దరూ కలసి పోరాడి పార్టీని ఒడ్డుకు చేర్చారు. అదే టీడీపీలో 1995లో మరోసారి అంతర్గత తిరుగుబాటు వచ్చింది. అపుడు దగ్గుబాటి బాబు చేతులు కలిపి ఒక్కటిగా నిలిచారు. అలా పార్టీని కాపాడారు. అయితే ఎన్టీఆర్ ని దించేశారు అన్న అపప్రధ వచ్చింది.

ఆ తర్వాత చూస్తే చంద్రబాబు సీఎం అయ్యారు. దగ్గుబాటి రాజకీయ జీవితమే ఏమీ కాకుండా పోయింది. ఆయన బీజేపీ కాంగ్రెస్ వైసీపీ ఇలా అనేక పార్టీలు మారారు. చివరికి ఆయన రాజకీయ విరామం ప్రకటించి బాబుతో సయోధ్యకే ప్రాధాన్యత ఇచ్చారు.

రాజకీయాల కంటే కుటుంబ బంధాలు మేలు అని తలచారు. ఆయన తాజాగా రచించిన ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ అవి గతం ఇపుడు అనవసరం. ఇద్దరం ఒక్కటిగా ఉంటామని ప్రకటించారు. బాబు చేస్తున్న అభివృద్ధికి ఆయన కృషికి అభినందనలు చెప్పారు.

కాలంతో పాటే మనుషులు మారాలని ఎల్లకాలం ఒక్కలాగే ఉండరాదని దగ్గుబాటి చెప్పారు. మంచిగా ఉండాలి అందరి మంచిని కోరుకోవాలని ఆయన అన్నారు. ఇలా ఎంతో హుందాగా పరిపక్వతతో కూడిన తీరుతో దగ్గుబాటి చేసిన ఈ ప్రసంగం చంద్రబాబుతో పాటు అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత దగ్గుబాటిని బాబు అక్కున చేర్చుకుని కౌగిలించుకున్నారు. అలా ఇద్దరు నేతలూ ఎంతో పరిణతితో ఒక్కటిగా నిలవడం చూసిన వారు అంతా ఇలాగే కదా అంతా ఉండాలని అనుకున్నారు. చంద్రబాబు గురించి దగ్గుబాటి గొప్పగా చెబితే దగ్గుబాటి గురించి బాబు కూడా అంతే గొప్పగా చెప్పారు.

ఒక విధంగా అన్న గారి అల్లుళ్ళు ఇద్దరూ ఇలా చేతులు కలిపి రాజకీయాలకు అతీతం మా బంధం అని చాటి చెప్పడం ఈ తరానికి స్పూర్తి అని అంటున్నారు. రాజకీయాల కోసం సొంత వారినే వెన్నుపోటు పొడుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న వారికి ఈ సన్నివేశం ఒక కనువిప్పు కావాలని కూడా అంటున్నారు. ఒకనాడు తెలుగుదేశంలో ఒక్కటిగా మెలిగిన ఈ తోడల్లుళ్ళను మళ్ళీ ఇలా చూసిన టీడీపీ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News