తెలంగాణ కేబినెట్ లో కొత్త మంత్రులు.. పదవుల మార్పు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ భవిష్యత్తు చర్యలపై అధిష్టానం దృష్టి సారించగా, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించే అవకాశముంది.;

Update: 2025-03-06 13:09 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, ముఖ్య పదవుల భర్తీపై ఏఐసీసీ తాజా వ్యూహంతో ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలను, సీనియార్టీని దృష్టిలో ఉంచుకుని కొత్త జాబితా సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ భవిష్యత్తు చర్యలపై అధిష్టానం దృష్టి సారించగా, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించే అవకాశముంది.

-కీలక చర్చలు.. కీలక నిర్ణయాలు

ఈ మధ్యాహ్నం సీఎం రేవంత్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పదవుల ఖరారు, పార్టీ–ప్రభుత్వంలో సమతుల్యతకు చర్యలు చేపట్టనున్నారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి, చీఫ్ విప్, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంపై అధిష్టానం స్పష్టమైన దిశలో ముందుకు సాగుతోంది. లంబాడా వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి, నల్గొండ జిల్లాకు ఉప సభాపతి హోదా దక్కే అవకాశమున్నట్లు సమాచారం.

- ఎవరికీ ఏ పదవి?

చీఫ్ విప్: రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేకు అవకాశం.

మైనార్టీ మంత్రి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ నేతకు అవకాశం.

నల్గొండ జిల్లా మంత్రి: మరో నేతకు అవకాశం, అయితే వర్గ సమీకరణాల ఆధారంగా చివరి నిర్ణయం.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా: ఇప్పటికే హామీ ఇచ్చిన సీనియర్ నేతకు మంత్రివర్గంలో చోటు.

- సామాజిక సమీకరణాలు – కీలక మార్పులు

ఏఐసీసీ సూచనల మేరకు ఇద్దరు బీసీ నాయకులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతకు అవకాశం దక్కుతుండగా, నిజామాబాద్ నుంచి ఓ సీనియర్ నేతకు తిరిగి మంత్రిపదవి లభించనుంది. అదిలాబాద్ నుంచి దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖరారైంది. మొత్తంగా, ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్డి వర్గానికి చెందిన వారు, ఒక మైనార్టీ, ఒక దళిత వర్గానికి చెందిన నేత మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకోనున్నారు.

ఇక నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక సమీకరణాలను పాటిస్తూ నియామకాలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో అన్ని అంశాలకు అధిష్టానం నుంచి ఆమోదం పొందే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News